ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కొంత మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమను వేధిస్తున్నారని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్, రిజి్రస్టార్, డైరెక్టర్లకు ఈ – మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మెయిల్‌లో ఆరోపించారు.
స్కాలర్‌షిప్‌ల కోసం వేలి ముద్రలు వేసే సమయంలో కొందరు బోధనేతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి క్యాంపస్‌లో దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇది అనాధారిత మెయిల్ అని అధికారులు చెబుతున్నప్పటికీ... తమ పేరు బయటకు రాకుండా ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి విద్యార్థులు ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు.
మెయిల్ ఎవరు చేశారనే కోణంలో కాకుండా ఫిర్యాదులోని వాస్తవాలపై విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు బోధనా సిబ్బందిలో చాలా మంది పాఠాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోమని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేజీవీడీ బాలాజీ తెలిపారు.


