బెంగళూరు: స్నేహితులతో కలిసి హోటల్‌లో పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు రావడంతో భయపడి ఓ యువతి పరుగులు తీసే క్రమంలో పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వైష్ణవి (21), 8 మంది స్నేహితులతో ఏఇసీఎస్ లేఔట్‌లోని ఓ హోటల్‌లో 3వ అంతస్తులో పార్టీ పెట్టుకున్నారు.
స్థానికులు ఫిర్యాదు చేయడంతో
అర్ధరాత్రి గట్టిగా మ్యూజిక్ వేసుకుని కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు 112 కు ఫోన్‌చేశారు. స్థానిక పోలీసులు వచ్చి పార్టీ జరుగుతున్న పై అంతస్తుకు వెళ్లారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. వైష్ణవి భయపడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి పైపును పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నిస్తుండగా జారి కింద ఇనుప గ్రిల్స్ మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మృత్యువు అంచుల్లో ఉంది.
లంచం అడిగారు
హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు కేసు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని అడిగారు, మేము ఫోన్ పే చేస్తామని చెప్పగా, వద్దు క్యాష్ కావాలన్నారు అని పారీ్టలో పాల్గొన్నవారు ఆరోపించారు. దీనిపై డీసీపీ విచారణ చేపట్టారు. హోటల్, పోలీసు సిబ్బందిపై యువతి తండ్రి ఆంథోనీరాజ్ హెచ్‌ఏల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


