రాజేష్ మృతి ఎఫెక్ట్‌.. సీఐ సస్పెండ్‌, ఎస్‌ఐపై చర్యలు | Kodada CI Suspended In Rajesh Case | Sakshi
Sakshi News home page

రాజేష్ మృతి ఎఫెక్ట్‌.. సీఐ సస్పెండ్‌, ఎస్‌ఐపై చర్యలు

Dec 20 2025 10:51 AM | Updated on Dec 20 2025 11:14 AM

Kodada CI Suspended In Rajesh Case

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజేష్‌ మృతి నేపథ్యంలో కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌పై చర్యలు తీసుకున్నారు. సురేష్‌ను వీఆర్‌కు అటాచ్‌ చేశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. స్థానిక మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పనిచేసే చడపంగు నరేష్‌ కొంతమంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అదే పేరుతో ఉన్న ఇతరుల బ్యాంకు ఖాతాల్లో వేయించి సొమ్ము చేసుకున్నాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నరేష్‌తో పాటు మరికొందరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా చిలుకూరుకు చెందిన కె. రాజేష్‌ పేరుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును కోదాడకు చెందిన కె.(కర్ల) రాజేష్‌కు ఇచ్చి అతని అకౌంట్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు నరేష్‌ చెప్పాడు. దీంతో..

చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేష్‌ను అరెస్ట్‌ చేసి 10న రిమాండ్‌ విధించడంతో హుజూర్‌నగర్‌ సబ్‌ జైలుకు తరలించారు. 14వ తేదీ రాత్రి రాజేష్‌ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిలుకూరు పోలీసులను ఎస్కార్ట్‌ ఇచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న రాజేష్‌ మృతిచెందాడు. 17న పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిలుకూరు పోలీసులు కొట్టడం వల్లే రాజేష్‌ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేశారు. రాజేష్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కోదాడలోని కల్లుగడ్డ బజార్‌లో రాజేష్‌ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. రాజేష్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో లాకప్‌లో రాజేష్ మృతి చెందిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటన రీత్యా అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూరల్ సీఐ, ఎస్‌ఐపై కూడా చర్యలు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement