
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చలో ఢిల్లీ
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్న పీసీసీ చీఫ్, ఇతర నేతలు
ధర్నా కోసం ప్రత్యేక రైలు.. ప్రతి జిల్లా నుంచి 50 మంది తరలింపు
సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణలో పాలుపంచుకోవాలని నిర్ణయించింది. మూడురోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఆగస్టు ఆరో తేదీన జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనేలా.. ప్రత్యేక రైలులో ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మందిని పంపనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
ప్రత్యేక రైలు ఈనెల ఆరో తేదీ ఉదయం కల్లా ఢిల్లీ చేరుకునేలా సమన్వయం చేయనుంది. ఢిల్లీలో పోరాటం నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర షెడ్యూల్‌ను కుదించారు. వాస్తవానికి ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆరు ఉమ్మడి జిల్లాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాల్సిన ఈ పాదయాత్రను వచ్చే నెల నాలుగో తేదీకి కుదించారు. నాలుగో తేదీ సాయంత్రం పాదయాత్ర ముగిసిన వెంటనే ముఖ్య నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో పాటు ముఖ్య నాయకత్వమంతా ఢిల్లీలోనే ఉండి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగస్వాములు కావాలని పీసీసీ పిలుపునిచ్చింది.
త్వరలో కార్పొరేషన్ డైరెక్టర్లు, బోర్డు సభ్యుల ప్రకటన
పార్టీ సంస్థాగత నిర్మాణం, పాదయాత్ర, ఢిల్లీ టూర్, నామినేటెడ్ పదవులపై చర్చించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశమయ్యారు. సీఎం నివాసంలో గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. నామినేటెడ్ పదవుల కోసం జిల్లా ఇన్‌చార్జుల నుంచి వచ్చిన జాబితాలను మీనాక్షి, మహేశ్‌గౌడ్‌లు ముఖ్యమంత్రికి అందజేశారు.
ఆయన వీటిని పరిశీలించి తుది జాబితాను ఖరారు చేస్తారని, వారం, పది రోజుల్లో కార్పొరేషన్ డైరెక్టర్లు, బోర్డు సభ్యులను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బీసీ రిజర్వేషన్ల పోరాట ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఈ నెల ఐదో తేదీన పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశం చర్చకు వచ్చేలా వాయిదా తీర్మానం కోసం పార్టీ తరఫున పట్టు పట్టాలని, ఆరో తేదీన జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని, ఏడో తేదీన రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు.