
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.
ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.
అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్‌లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు.