
సీఎం రేవంత్ సొంత జిల్లాలో అధికార కాంగ్రెస్ సతమతం
ఎవరికి వారే వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు
గద్వాలలో బండ్ల, సరిత యాదవ్... వనపర్తిలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య తీవ్రమవుతున్న విభేదాలు
ఎంపీ మల్లు రవిపై అధిష్టానానికి అలంపూర్ నేతల ఫిర్యాదు
గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, బిల్లులకు 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని ఆక్షేపణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు.
ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం.
చాప కింద నీరులా..
చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది.
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది.
ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది.
అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్‌ఎస్ సెగ కాంగ్రెస్‌ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది.
ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి కలిసి అటు ఆలంపూర్‌లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు.
బీఆర్‌ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్‌ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
మంత్రులకు... మేం తక్కువా?
పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్‌ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు.
మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్‌లో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్‌సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం.
ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే!