
డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారికి మళ్లీ అదే పదవి ఇవ్వొద్దని నిర్ణయం
పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు నో చాన్స్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత
ని‘బంధనాలు’ విధించిన ఏఐసీసీ
జూమ్ మీటింగ్‌లో మీనాక్షి,మహేశ్ గౌడ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోసారి డీసీసీ అధ్యక్షుడు కావాలనుకుంటున్న నేతల ఆశలపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. పార్టీలో సీనియార్టీ, ప్రస్తుతం అనుభవిస్తున్న పదవులు, సామాజిక వర్గాలు, బంధుత్వాలు, ఇతర అంశాలతో పని లేకుండా ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారెవరినీ మళ్లీ అదే పదవిలో నియమించబోమని స్పష్టం చేసింది. అంటే అందరూ కొత్తవారే ఉంటారు. దీంతో చాలామంది ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాల ప్రక్రియ జోరందుకున్న వేళ మంగళవారం జూమ్ మీటింగ్ వేదికగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇప్పుడు డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారెవరూ రెండోసారి నియమితులు కాబోరని, వారు దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు. దీంతోపాటు డీసీసీ అధ్యక్ష నియామకాల కోసం ఏఐసీసీ అనేక ని‘బంధనాలు’పెట్టింది. మీనాక్షి, మహేశ్‌గౌడ్ డీసీసీ అధ్యక్షులతో వెల్లడించిన వివరాలు ఇలా...
–డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఐదేళ్లపాటు నిరంతరాయంగా పార్టీలో పనిచేయాలి. అదేవిధంగా క్రమశిక్షణతో పనిచేసి ఉండాలి. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు వారిపై సిఫారసు చేసి ఉండకూడదు. ఒకవేళ అలాంటి నేతలు దరఖాస్తు చేసుకుంటే ఏఐసీసీ పరిశీలకులే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు.
–ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారి దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా ఈసారి అవకాశాల్లేవు.
–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నేతలకు ప్రాధాన్యత ఉంటుంది.
–ఏఐసీసీ పరిశీలకులుగా జిల్లాలకు వచ్చిన వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. ఏఐసీసీ పరిశీలకులతో వ్యక్తిగత సంభాషణలు చేయొద్దు. ప్రైవేటుగా సమావేశాలు పెట్టుకోవద్దు.
–ఎట్టి పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం అభిప్రాయ సేకరణ సమావేశాలను నాయకుల ఇళ్లలో లేదా వారి సొంత కార్యాలయాల్లో నిర్వహించడానికి వీల్లేదు. పార్టీ కార్యాలయాల్లో గానీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఇతర ప్రాంతాల్లో గానీ నిర్వహించాలి.
–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలి.
–అదేవిధంగా ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్‌చోరీ క్యాంపెయిన్‌ను విస్తృతం చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం 100 మంది చేత సంతకాలు చేయించి టీపీసీసీకి పంపాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్ ఆదేశించారు.