రాహుల్‌గాందీతో సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి, మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షీ నటరాజన్, నవీన్‌యాదవ్
జూబ్లీహిల్స్‌లో గెలుపుతో స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా
అదే ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలంటూ దిశానిర్దేశం
సమష్టితత్వంతో స్థానికంలోనూ పాగావేయాలని సూచన
పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్దేశం
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, ఖర్గే, కేసీలతో సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ భేటీ
ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్‌కు అభినందనలు
రేపటి కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది.
‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కేబినెట్‌లో నిర్ణయం: మహేశ్ గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు.
సిబల్ విందుకు సీఎం
రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్‌లో ‘దిల్‌సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.


