బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి రండి | Mahajana Padayatra in Parigi | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి రండి

Aug 1 2025 12:32 AM | Updated on Aug 1 2025 12:32 AM

Mahajana Padayatra in Parigi

మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్‌. చిత్రంలో మహేశ్‌కుమార్‌గౌడ్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు

ప్రజల కోసమేజనహిత పాదయాత్ర  

కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ 

వచ్చే రెండేళ్లలో 35 వేలఉద్యోగాల భర్తీ: పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

పరిగిలో మహాజన పాదయాత్ర  

వికారాబాద్, పరిగి: ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని.. అందుకే వారి కోసం పాదయాత్ర చేస్తున్నామని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో కాంగ్రెస్‌ చేపట్టిన జనహిత పాదయాత్ర, రోడ్‌షోలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆమె గురువారం పాల్గొన్నారు. 

మండల పరిధిలోని రంగాపూర్‌ నుంచి పరిగి పట్టణం వరకు ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక కొడంగల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మీనాక్షి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోసం కేంద్రంతో పోరాడుతున్నామని, ప్రజలు సైతం ఇందులో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందని తెలిపారు.  

65 వేల ఉద్యోగాలిచ్చాం.. 
పాదయాత్రలకు కాంగ్రెస్‌ పెట్టింది పేరు అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక 65 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ అధినాయకత్వం డిమాండ్‌ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖం చాటేస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు రావాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులను కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేసి తీరుతామని స్పష్టంచేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, బి.మనోహర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, పీసీసీ ప్ర«ధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ చైర్మన్‌ రామచల్ల సిద్ధేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement