
ఆరు నియోజకవర్గాల్లో శ్రమదానం, ప్రజలతో ముఖాముఖి
పీసీసీ చీఫ్‌తో కలిసి ప్రతిరోజూ స్థానిక నేతలతో సమావేశాలు
స్థానిక ఎన్నికలకు కేడర్ సమాయత్తం.. ప్రభుత్వ పథకాల ప్రచారం
పరిగిలో షురూ.. వర్ధన్నపేటలో ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున ఆరు రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 31వ తేదీన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండిల మీదుగా ఆగస్టు 5వ తేదీన వర్ధన్నపేట వరకు సాగనుంది. యాత్రలో భాగంగా ప్రతిరోజూ శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ద్విముఖ వ్యూహం
మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్‌ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జైబాపూ, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జైబాపూ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్దేశించింది.
ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఉదయాన్నే శ్రమదానం చేయడం, ఆ తర్వాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావడం, అనంతరం నడక ప్రారంభించి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి మాట్లాడనున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర: టీఆర్‌ఆర్
సోమవారం గాందీభవన్‌లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. జూలై 31 పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌లో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌లతో పాటు పీసీసీ నేతలు కేతూరి వెంకటేశ్, జూలూరు ధనలక్ష్మి, పులి అనిల్‌కుమార్‌లతో పాదయాత్ర సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ పీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు నేతలతో కీలక భేటీలు
మీనాక్షి నటరాజన్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాల వారీగా టీపీసీసీ నియమించిన ఇన్‌చార్జ్‌లతో ఆమె సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రతి జిల్లా నాయకత్వంతో విడివిడిగా సమావేశం కానున్న మీనాక్షి.. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి జరుగుతున్న కసరత్తుపై చర్చిస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.