
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈసారి యాత్ర
16న హైదరాబాద్‌కు రానున్న మీనాక్షి నటరాజన్
15న నిర్వహించాల్సిన కామారెడ్డి సభ వాయిదా
రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తర్వాత జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో ఈసారి యాత్ర జరగనుంది.
ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల నేతలకు ఇప్పటికే టీపీసీసీ ఆదేశాలి్చంది. ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్న మీనాక్షి వారం పాటు ఇక్కడే ఉంటారని సమాచారం. జనహిత పాదయాత్రలో పాల్గొనడంతోపాటు ఈ దఫా పర్యటనలో ఆమె కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పార్టీ నాయకత్వానికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఈసారి క్లియర్ అవుతుందని సమాచారం. అందుకోసం ఆమె మరోమారు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమవుతారని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చేవారంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటివరకు బస్తీలు, వార్డులవారీ సమావేశాలకు పరిమితమైనా వచ్చే వారంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద సభను నిర్వహించాలని, ఈ సభకు సీఎం రేవంత్‌తోపాటు మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్థానిక నేతలతో పాటు ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా మీనాక్షి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని గాం«దీభవన్ వర్గాల సమాచారం.
కాగా, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ పదవి చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీల సమరభేరి సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచన కారణంగా సభను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలపై చర్చించేందుకు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం భేటీ కానుంది.