
రీయింబర్స్‌మెంట్ బకాయిల సాధన కోసం సమ్మెబాట పట్టాలని నిర్ణయం
15 నుంచి నిరవధికంగా కాలేజీల మూసివేత
పిలుపునిచ్చిన వృత్తివిద్యా కాలేజీల యాజమాన్యాల సంఘం
ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా వెల్లడి
ఈ నెల 30లోగా బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళన
16 నుంచి మేము సైతం.. డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సాధించుకునే దిశగా ఆందోళన చేపట్టాలని రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్‌ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్(ఫతి) ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డిని కలిసి సమ్మె చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా తెలిపాయి. ఈ నెల 30లోగా ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. బంద్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,500కుపైగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలు మూతపడతాయని.. దీనివల్ల సుమారు 10 లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని సంఘం నేతలు పేర్కొన్నారు.
రూ. 10 వేల కోట్లకు చేరిన బకాయిలు..
సుమారు రూ. 10 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో సర్కారు విఫలమైందంటూ కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్íÙప్‌ల బకాయిల సాధన కోసం ‘ఫతి’పేరిట ఏర్పడి పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరితోనూ సమావేశమయ్యాయి. అయినా సర్కారు ఒక్క రూపాయి కూడా బకాయిలు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను యాజమాన్యాలు సర్కారు ముందుంచాయి.
రూ. లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. రూ. లక్ష కోట్ల డిపాజిట్ల సొమ్ముతో ప్రభుత్వ వాటా పరిమితమేనని.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్), కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారా ఈ నిధులను సేకరించవచ్చని సూచించాయి. ఈ డిపాజిట్లపై వచ్చే 7 శాతం వడ్డీ (సుమారు రూ. 3 వేల కోట్లు)తో ఫీజు రీయింబర్స్‌చేయవచ్చని ప్రతిపాదించాయి. అయితే అందుకు కూడా ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో విసిగిపోయిన కాలేజీల యాజమాన్యాలు.. రాష్ట్రంలోని అన్ని రకాల వృత్తివిద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమావేశం అనంతరం ఈనెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు ‘ఫతి’పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయనందుకు ఇంజనీర్స్‌డేను బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించాయి.
16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా..
‘ఫతి’బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం(టీపీడీపీఎంఏ) కూడా కాలే జీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరెడ్డి, యా ద రామకృష్ణలు ప్రకటించారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
దసరా జరుపుకోలేని పరిస్థితులున్నాయి
ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యకు తొలి ప్రాధాన్యత లభిస్తుందనుకున్నాం. కానీ అసలు ప్రాధాన్యతే లేకుండా పోయింది. రూ. 10 వేల కోట్ల బకాయిల విడుదల కోసం 6 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం. ప్రత్యామ్నాయ ప్రణాళికను సర్కారు ముందుంచాం. దసరా పండుగను సంతోషంగా జరుపుకోలేని పరిస్థితులున్నాయి. జీతాలు ఇవ్వకపోతే సోమవారం నుంచి విధులకు హాజరుకాబోమని సిబ్బంది తేలి్చచెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాం. ఈ నెల 30లోగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి. – రమేశ్, ‘ఫతి’చైర్మన్
6 నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం
ప్రైవేటు కాలేజీల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. యజమానులుగా మధ్యాహ్నం పూట కాలేజీకి వెళ్లలేకపోతున్నాం. సాయంత్రం, రాత్రిపూట వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్నాం. బకాయిల విడుదల కోసం ఉప ముఖ్య మంత్రి భట్టిను నాలుగుసార్లు కలిశాం. ఇంజనీర్స్‌డేను బ్లాక్‌డేగా పాటించి, బంద్‌ను పాటించబోతున్నాం. ఆగస్టు 31 వరకు మాకు రావాల్సిన పూర్తి బకాయిలను విడుదల చేయాలి. – కేవీ రవికుమార్, ‘ఫతి’నాయకుడు