
కొత్త మున్సిపాలిటీల్లో సవాలక్ష సమస్యలు
ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక ఇబ్బందులు
పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి
మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ అయినా పాత వేతనాలే
కమిషనర్ల వేతనాలు కూడా జనరల్ ఫండ్ నుంచే
ఇంజనీరింగ్, ఇతర పాలనా సిబ్బంది కోసం వెయిటింగ్
ప్రత్యేక గ్రాంట్లు ఇస్తే తప్ప మున్సిపాలిటీల మనుగడ కష్టమే అంటున్న స్థానికులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక సిబ్బందికి నెలల తరబడి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం కేటాయించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. వివిధ శాఖల నుంచి రావాల్సిన సెస్సులు, గ్రాంట్లు రాకపోవడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత మూడు దఫాలుగా 20 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక గ్రాంట్లు ఇస్తే తప్ప ఈ మున్సిపాలిటీలు మనుగడ సాగించే పరిస్థితి లేదని స్థానికులు అంటున్నారు.
సిబ్బంది, మౌలిక వసతుల లేమి..
కొత్త మున్సిపాలిటీల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థిర, చరాస్తులు.. భవనాలు, లే ఔట్ అనుమతులు, పన్నుల వసూలుకు సంబంధించిన ఫైళ్లను కమిషనర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ వంటి ఒకటిరెండు మిన హా మిగతా పోస్టుల్లో సమీప మున్సిపాలిటీలకు చెందిన అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్ప గించారు. దీంతో వారు కొత్త మున్సిపాలిటీలకు అరుదుగా వచ్చి వెళ్తున్నారు.
మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులు భర్తీ కాకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్‌చార్జిలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు మున్సిపల్ కార్యాలయాలుగా బోర్డులు మార్చినా ఫరి్నచర్ కొరత వేధిస్తోంది. రికార్డులను భద్రపరచడం సమస్యగా మారింది. మున్సిపల్ కార్యాలయాలకు వచ్చే వారు కనీసం కూర్చునే పరిస్థితి లేదు.
ఆదాయానికి, ఖర్చుకు కుదరని లంకె..
కొత్త మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో రెండేళ్లవరకు పన్నులను సమీక్షించి పెంచే అవకాశం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు వస్తున్న ఆదాయంతోనే పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ శివార్లలోని ఇస్నాపూర్, ఇంద్రేశం వంటివాటికి మినహా మిగతా చోట్ల ఆర్థిక పరిపుష్ట లేక సమస్యలు ఎదురవుతున్నాయి.
గ్రామ పంచాయతీలకు సాధారణంగా ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, వాణిజ్య లైసెన్సుల జారీ, వాటి రెన్యూవల్, తైబజార్ వేలం, పశువుల సంత తదితరాల ద్వారా జనరల్ ఫండ్ సమకూరుతోంది. పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల విడుదల నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్, ఇతర విభాగాల నుంచి సెస్సుల విడుదల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ డీజిల్ వంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో కొత్త మున్సిపాలిటీలు ఉన్నాయి.
కమిషనర్ వేతనం కూడా జీఎఫ్ నుంచే..
కమిషనర్, అధికారులు, ఇతర ఉద్యోగుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయకపోవడంతో వేతనాల చెల్లింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి 010 పద్దు కింద వేతనాలు చెల్లించే వెసులుబాటు లేకపోవడంతో జనరల్ ఫండ్ (జీఎఫ్) నుంచే కమిషనర్, సిబ్బంది వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. విలీన గ్రామపంచాయతీల కార్యదర్శులు పట్టణంలో పనిచేస్తూ పంచాయతీరాజ్ విభాగం నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో పనిచేసే కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీల్లో రూ.9,500 వేతనం పొందే వారు. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో వారికి ప్రతి నెలా రూ.15,600 వేతనం చెల్లించాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల పాత వేతనాలే ఇస్తున్నారు. వాటిని కూడా నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కొత్త మున్సిపాలిటీలు ఇవే..
కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం (సంగారెడ్డి).. కేసముద్రం (మహబూబాబాద్).. స్టేషన్ ఘన్‌పూర్ (జనగాం).. మద్దూర్ (నారాయణపేట).. ఎదులాపురం, కల్లూరు (ఖమ్మం).. అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం).. చేవెళ్ల, మొయినాబాద్ (రంగారెడ్డి).. ములుగు (ములుగు).. అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ (మేడ్చల్–మల్కాజ్‌గిరి).. బిచ్కుంద (కామారెడ్డి).
జిల్లా కేంద్రమే అయినా..
ములుగు జిల్లా కేంద్రం ఈ ఏడాది 29న గ్రామ పంచాయతీ నుంచి అప్‌గ్రేడ్ అయ్యి 20 వార్డులతో కొత్త మున్సిపాలిటీగా ఏర్పడింది. పొరుగునే ఉన్న బండారుపల్లి, జీవింతరావుపల్లి పంచాయతీలు ఇందులో విలీనం అయ్యాయి. ఇప్పటివరకు కమిషనర్, మేనేజర్ మాత్రమే బదిలీపై వచ్చారు. పురపాలనలో అత్యంత కీలకమైన ఏఈ, టీపీఎస్, అకౌంట్స్ ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలో ప్రస్తుతం 130 మంది మల్టీ పర్పస్ వర్కర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో 80 మంది పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నవారే. మున్సిపాలిటీ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలుగా కాగా, ఏటా రూ.3.27 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వస్తోంది. దీంతోపాటు మరో రూ.1.20 కోట్లు కార్యాలయ నిర్వహణ, వాహనాలు, ఇంధనం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.
నాలుగు నెలలుగా జీతాల్లేవు..
కల్లూరు గ్రామ పంచాయతీలో గడిచిన 23 ఏళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నా. నాతోపాటు మరో 93 మంది మల్టీ పర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసిన కాలంలో నెలకు రూ.9,500 వేతనం ఇచ్చేవారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎంత వేతనం వస్తుందో తెలియదు. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. జీఓ 60ని అనుసరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ, జీవిత బీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సయ్యద్ వజీర్ మియా, ఎలక్ట్రీషియన్, కల్లూరు మున్సిపాలిటీ