
ముఖ ఆధారిత హాజరు గుర్తింపు వివరాలు పంపండి
75 శాతం హాజరుకాని విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌లో కత్తెరేయాల్సిందే
ప్రతి విద్యార్థికీ యూనిక్ కోడ్ ఇచ్చేద్దాం.. డిజీ లాకర్ విధానంపై స్పీడ్ పెంచండి
వర్సిటీల వీసీలతో సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వీసీ బాలకిష్టారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమబద్ధికరించే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ముఖ ఆధారిత హాజరు విధానం అమలుపై దృష్టిపెట్టారు. ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందుతున్న విద్యా ర్థులు ఎంత మంది? వారిలో నిత్యం కాలేజీలకు హాజరయ్యే వారు ఎందరు? 75 శాతం లోబడి విద్యార్థుల హాజరున్న కాలేజీలు ఎన్ని? ఎందరు విద్యార్థులు ఈ విభాగం కిందకు వస్తారు? అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వర్సిటీల స్థాయి లో ఇప్పటికే ముఖ ఆధారిత హాజరు విధానం అమ లు చేస్తున్నారని.. వర్సిటీల అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రం ఇది అమలు కావట్లే దని వీసీలు తెలిపారు. దీన్ని కచి్చతంగా అమలు చేసేలా చూడాలని చైర్మన్ సూచించినట్లు తెలిసింది.
కోతకు లెక్కలేంటి?
కాలేజీకి సరిగా రాని విద్యార్థులకు, రెగ్యులర్‌గా కాలేజీకి వచ్చి చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒకే విధంగా ఉండటం ఏమిటనే ప్రశ్న ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు ఎందరు ఉంటారో చెప్పాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఇటీవల అడిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏ మేరకు కుదించే వీలుందో పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని వీసీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది? కాలేజీకి హాజరవ్వని విద్యార్థులు ఎందరు? ఈ దిశగా సమగ్ర సమాచారం సేకరించాలని వీసీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరినట్లు తెలిసింది. ఆ వివరాల ఆధారంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ లెక్కలను తయారు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
డిజీ లాకర్ విధానం
పూర్తిగా డిజిటల్ విధానంలోకి యూనివర్సిటీలు వెళ్ళాలని బాలకిష్టారెడ్డి వీసీలకు సూచించారు. సర్టి్టఫికెట్లను ఆన్‌లైన్ విధానంలోనూ అందుబాటులోకి తేవాలని.. దీనివల్ల తప్పుడు ధ్రువీకరణ పత్రాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. డిజీ లాకర్ విధానంతోపాటు ప్రతి విద్యార్థికీ యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రతి వర్సిటీ నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ దిశగా బోధన ప్రణాళికలో సమూల మార్పులు తేవాలని.. తద్వారా సమీకృత బోధన విధానం అమలుకు కృషి చేయొచ్చన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సుల్లో క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్లు పురుషోత్తం, మహ్మద్, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.