‘చితి’కిపోయిన వ్యక్తిని సర్పంచ్‌ను చేశారు
కావాలి ఎన్నికల కమిషన్ అనుమతి
ఉపసర్పంచ్‌గా గొట్ల కుమార్‌యాదవ్
సర్పంచ్ ఎన్నికపై సందిగ్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లా: చింతల్‌ఠాణా ఓటర్లు ఎన్నికల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ప్రచార సమయంలోనే గుండెపోటుతో మరణించాడు. అయితే ఎన్నికల్లో మరణించిన వ్యక్తికే ఓట్లు వేసి గ్రామస్తులు గెలిపించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చెర్ల మురళికి కత్తెర గుర్తు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో అలసిపోయి ఇంట్లో నిద్రిస్తుండగా ఈనెల 3న గుండెపోటుతో మరణించాడు. కానీ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో ఆ ఊరి ఓటర్లు భారీ మెజార్టీతో చనిపోయిన వ్యక్తి మురళిని గెలిపించారు. దీంతో సర్పంచ్ ఎన్నికపై సందిగ్ధం నెలకొంది.
బరిలో నిలిచిన అభ్యర్థులు వచ్చిన ఓట్లు..
చింతల్‌ఠాణా గ్రామపంచాయతీకి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ బలపరిచిన కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, బీఆర్‌ఎస్ బలపరిచిన చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బడుగు శ్రీనివాస్‌కు 40, ఇండిపెండెంట్ మంత్రి రాజలింగంకు 160, బీజేపీ బలపరిచిన సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. నోటాకు 5, చెల్లని ఓట్లు 44 పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. ఉపసర్పంచ్‌గా గొట్ల కుమార్‌యాదవ్ ఎన్నికయ్యారు.
అయోమయంలో అధికారులు
పోటీ చేసిన వ్యక్తి మరణిస్తే.. శాసనసభ ఎన్నికలు అయితే వాయిదా పడుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగించారు. అప్పటికే ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు ఇవ్వడంతో ఎవరికి వారు ప్రచారంలో ఉన్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి గుర్తును మార్పు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ముందుగానే ముద్రించిన బ్యాలెట్ పత్రాలు కావడంతో ఏమీ చేయలేక అధికారులు నోటాతో కలిపి ఆరు గుర్తులున్న బ్యాలెట్‌పత్రంతో ఎన్నికలు నిర్వహించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సానుభూతి పవనాలు వీచి చనిపోయిన వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.దీనిపై క్లారిటీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాశారు. సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఉన్న అభ్యర్థుల్లో రెండో స్థానం పొందిన వ్యక్తికి సర్పంచ్‌గా అవకాశం ఇస్తారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు చెబుతున్నారు.


