
సీఐఐ అవార్డుల ప్రదానోత్సవంలో భట్టి విక్రమార్క, దేవ్‌జ్యోతి,శివప్రసాద్‌రెడ్డి, బీవీఆర్ మోహన్‌రెడ్డి
కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదం
గత పాలకులు ఈ అంశాన్ని విస్మరించి వేలంలో పాల్గొనలేదు
సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులను కోల్పోయాం
రూ.60వేల కోట్ల రెవెన్యూ నష్టం వచ్చింది.. సింగరేణికి రూ.15 వేల కోట్ల నష్టం
గ్రీన్ హైడ్రోజన్ గురించి ఆలోచిస్తున్నాం: విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: ఇకపై దేశంలో ఎక్కడ బొగ్గు గనుల వేలం జరిగినా సింగరేణి సంస్థ పాల్గొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి పరిధిలో ఉన్న ప్రస్తుత గనులు తరిగిపోతున్నాయని, మరో పదేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ ఉనికికి కూడా ప్రమాదం పొంచి ఉందని, ఈ ప్రమాదం బారి నుంచి సింగరేణిని కాపాడుకొని నిలబెట్టుకునేందుకే ఈ నిర్ణ యం తీసుకున్నామని చెప్పారు.
శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే కె.విజయరమణారావు, సింగరేణి సీఎండీ బలరాం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మిక సంఘాలతోపాటు బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించే వేలంలో పాల్గొనకుండా గత పాలకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సత్తుపల్లి, కోయగూడెం మైనింగ్ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు దారాధత్తమయ్యాయి.
తద్వారా రాష్ట్రానికి రూ.60వేల కోట్ల రెవెన్యూ నష్టం వచ్చింది. సింగరేణి సంస్థకు రూ.15వేల కోట్లు నష్టం కలిగింది. బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే అటు సింగరేణితోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. సింగరేణికి కొత్త బ్లాకులు వస్తాయి. రాష్ట్రానికి రాయల్టీ రూపంలో ఆదాయం వస్తుంది. సింగరేణి మనుగడ దృష్ట్యా ఇకపై ఎక్కడ బొగ్గు గనుల వేలం జరిగినా పాల్గొనాలని నిర్ణయించాం.’అని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే కలిగే లాభాలు, పాల్గొనకపోవడం కారణంగా జరిగే నష్టాలు, ఇతర రాష్ట్రాల్లో గనుల వేలం జరిగిన తీరును గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
త్వరలోనే బంగారం అన్వేషణ
సింగరేణి వ్యాపార విస్తరణలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో రాగి, బంగారం తవ్వకాల లైసెన్స్‌ను సింగరేణి సంస్థ సాధించిందని భట్టి చెప్పారు. రాయచూర్, దేవదుర్గ్ బెల్టు లో రాగి, బంగారం బ్లాకులను వేలంలో దక్కించుకున్నా మని తెలిపారు. త్వరలోనే అన్వేషణ పనులు ప్రారంభిస్తా మన్నారు. ఈ ప్రాంతంలో భవిష్యత్‌లో జరిగే రాగి, బంగారం తవ్వకాలకు 37.75 శాతం రాయల్టీ వస్తుందని, ఇది సింగరేణి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు.
సింగరేణి గ్లోబల్ పేరుతో ఖనిజ రంగంలోకి థర్మల్, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై సింగరేణి దృష్టి సారించిందని భట్టి అన్నారు. దేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడ విలువైన ఖనిజాల వేలం జరిగినా పాల్గొనాలని, ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు ఓ కన్సల్టెంట్ కమిటీని నియమించినట్టు ఆయన చెప్పారు. గ్రీన్‌హైడ్రోజన్ పై కూడా దృష్టి సారించి సింగరేణి పనిచేస్తుందని, సింగరేణి గ్లోబల్ పేరుతో విలువైన ఖనిజాల రంగంలోకి ప్రవేశిస్తామని ఆయన వెల్లడించారు.
⇒ సింగరేణి సీఎండీ బలరాం మాట్లాడుతూ భవిష్యత్‌లో జరిగే వేలంలో పాల్గొని కొత్త బ్లాకులు సాధించడం ద్వారా సంస్థ మనుగడకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ దిశలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.
ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్
సీఐఐ అవార్డుల ప్రదానంలో డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి.. లైఫ్ సైన్సెస్ వరకు అధునాతన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాదు సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం సాయంత్రం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సౌత్ రీజియన్ నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ లీడర్‌షిప్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో భట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎఫ్‌వో కీలక భూమిక పోషించాలని కోరారు. కార్యక్రమంలో సీఐఐ దక్షిణ ప్రాంత డైరెక్టర్ దేవ్‌జ్యోతి, సీఐఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, సైయంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.