
పార్టీ ఆలోచన ఇదే... 90 శాతం ప్రజలకు పథకాలు అందుతున్నాయి
సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ సమన్వయంతో పనిచేస్తున్నారు
కామారెడ్డి డిక్లరేషన్‌కు పార్టీ కట్టుబడి ఉంది... వచ్చే నెల నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దృష్టి
టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో రిజర్వేషన్ల కల్పనే ప్రధానమని పార్టీ యోచిస్తోందని చెప్పారు. సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ భేటీలో మీనాక్షి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సమన్వయంతో పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు 90 శాతం మంది ప్రజలకు అందుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై వచ్చే నెల నుంచి పార్టీ దృష్టి సారిస్తుందని.. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారంలో డీసీసీ కమిటీలు పూర్తవుతాయని.. గ్రామ శాఖ అధ్యక్షుల ఎంపికను 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీల సమరభేరి సభను విజయవంతం చేయాలని మీనాక్షి పిలుపునిచ్చారు.
చేరికలను ఆహ్వానించాలి: భట్టి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అజేయంగా నిలపడం కోసం పీసీసీ చీఫ్ చేసే ప్రతి పనికీ సీఎం రేవంత్‌తోపాటు మంత్రివర్గమతా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సమాచారం తమ వద్ద ఉందని.. అందరికీ ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతుందని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై గ్రామ, మండల స్థాయి నుంచి వస్తున్న వివిధ పార్టీల నేతలను ఉద్యమంలాగా పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు.
మళ్లీ మనమే గెలుస్తాం: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నేతలు, కార్యకర్తలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ఖతమై రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్‌చార్జీలు, జై బాపు–జై భీం కార్యక్రమాల కమిటీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బూత్‌స్థాయి వరకు నెట్‌వర్క్: మంత్రి పొన్నం
టీపీసీసీ సమావేశం అనంతరం విప్ ఆది శ్రీనివాస్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులతో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించామని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌గౌడ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పార్టీ నాయకత్వం అభినందనలు తెలిపిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, 15న కామారెడ్డిలో బహిరంగ సభ, జనహిత పాదయాత్ర, ఓట్ చోరీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీపక్షాన హైదరాబాద్ నుంచి పోలింగ్ బూత్‌స్థాయి వరకు నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పొన్నం వెల్లడించారు. వివిధ కారణాలతో పార్టీ వీడిన నేతలను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని భట్టి చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు.