
‘మహబూబ్‌నగర్’ సమీక్షలో మాట్లాడుతున్న మహేశ్‌కుమార్‌గౌడ్. చిత్రంలో మీనాక్షి, వేం నరేందర్‌రెడ్డి
నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫిర్యాదు
‘నాగర్‌కర్నూలు’ సమీక్షలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి..
ఐఏఎస్, ఐపీఎస్‌లు పట్టించుకోవడం లేదన్న మహబూబ్‌నగర్ నేతలు
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గురువారం నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాం«దీభవన్‌లో జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. అయితే స్థానిక అంశాలపైనే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టు తెలిసింది.
⇒ నాగర్‌కర్నూల్ సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే సంపత్, ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. పదేళ్లు కష్టపడిన మమ్మల్ని పక్కన బెట్టి ఇతరులకు ప్రియార్టీ ఇస్తారా అని సంపత్ వర్గం మల్లు రవిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
⇒ మహబూబ్‌గర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రతినిధులుగా తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం.
వరంగల్ పార్లమెంటు సమావేశంలో స్థానిక అంశాలను ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. గాందీభవన్‌లో మూడు నియోజకవర్గాలకు విడివిడిగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లా డుతూ పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశాల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మూడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది.