జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల | iBomma Ravi Released On Chanchalguda Jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల

Feb 18 2026 7:01 PM | Updated on Feb 18 2026 7:13 PM

iBomma Ravi Released On Chanchalguda Jail

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంచల్‌గూడా జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదలయ్యాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదల అయ్యాడు. సినిమాల పైరసీ కేసులో నవంబర్‌ 16వ తేదీన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సుమారు 90 రోజులపాటు రవి జైలులోనే ఉన్నాడు. 

తాజాగా 12 షరతులతో కూడిన బెయిల్‌ కోర్టు ఇవ్వడంతో రవి విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయడంతో పాటు ప్రతీరోజు సీసీఎస్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశ విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్‌ వినియోగించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేసింది. అయితే, ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

కాగా,ఇమ్మడి  రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్‌ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్‌ పేర్లు, వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్‌ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది.  

గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్‌ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్‌ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్‌ కార్డు కలర్‌ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్‌ పేరుతోనే డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.

ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్‌మేట్‌ అయిన కాళీప్రసాద్‌ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్‌సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్‌.ఇన్, సప్లయర్స్‌.ఇన్‌ తదితర వెబ్‌సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్‌ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement