బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి హరీష్‌ రావు | BRS Leaders Respond Following Arrest of Balka Suman | Sakshi
Sakshi News home page

బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి హరీష్‌ రావు

Feb 18 2026 6:04 PM | Updated on Feb 18 2026 6:11 PM

BRS Leaders Respond Following Arrest of Balka Suman

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే  బాల్క సుమన్‌ అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్‌ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మాజీ మంత్రి హరీష్‌ రావు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీట్‌లో ‘బీఆర్‌ఎస్‌కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నది. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది. 

హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం. 

ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని తెలంగాణ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేస్తున్నాం.’అని పేర్కొన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement