తొలి అడుగు తడబాటు | The hung results are mostly in municipalities in the constituencies of first time MLAs | Sakshi
Sakshi News home page

తొలి అడుగు తడబాటు

Feb 19 2026 4:51 AM | Updated on Feb 19 2026 4:51 AM

The hung results are mostly in municipalities in the constituencies of first time MLAs

మున్సిపల్‌ ఎన్నికల్లో ఫలితాల సాధనలో వెనుకబడిన మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు 

ఫస్ట్‌ టైం ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా హంగ్‌ ఫలితాలు  

మూడు ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి.. 

ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు అదే తీరు

అనుభవరాహిత్యం, ప్రజలతో సత్సంబంధాల్లో వెనుకబడ్డారనే అభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: ‘మొదటిసారి ఎన్నికల్లో గెలవడం ఈజీ నే. కొత్తవారైనందున ఓటర్లలో సహజంగా ఉండే అభిప్రాయంతో పాటు ఇందుకు అనేక కారణాలుంటాయి. కానీ రెండోసారి, మూడోసారి గెలవడం అంత సులువు కాదు. ప్రజల మన్ననలు ప్రతిసారీ పొందాలంటే చాలా కష్టపడాలి. అసలు రాజకీయమంటే ఏంటో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుస్తుంది.’.. కాంగ్రెస్‌ పార్టీలో మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పే మాట ఇది. 

నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని, ఓటు బ్యాంకు కాపాడుకోవాలని, పట్టు కోల్పోవద్దని.. అలా జరగాలంటే అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండాలని ఆయన చెబుతుంటారు. కానీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఈ విధంగా తొలి అడుగు వేయడంలో పూర్తిగా తడబడ్డారు. పట్టణ ఓటరు నాడి అర్థం కాకనో, ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకనో కానీ పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో పార్టీని విజయపథంలో నడిపించ లేకపోయారు. 

చివరకు చైర్మన్లు, మేయర్లను ఎలాగోలా గెలిపించుకున్నా.. తొలిసారి ఎమ్మెల్యేలున్న చాలా మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడటం గమనార్హం. కానీ ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓటర్లకు పూర్తిస్థాయిలో స్పష్టత కొరవడటమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీని చూసి ఓటేయాలా? ఎమ్మెల్యే వైపు ఉండాలా? పాలన సరిగా లేదని ప్రతిపక్షం వైపు చూడాలా? అనే విషయాల్లో అస్పష్టత వల్లే ఆయా మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడిందని వారు అభిప్రాయపడుతున్నారు.

అంచనాల్లో వైఫల్యం! 
ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు ఇదే ఫలితం కనిపించింది. పార్టీ ఏదైనా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు తమ మున్సిపాలిటీల్లో పట్టు కనబర్చలేకపోయారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతల తీరును తొలిసారి ఎమ్మెల్యేలు అంచనా వేయలేకపోయారని, అనుభవరాహిత్యంతో పాటు ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో వైఫల్యం కారణంగానే ఇలాంటి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణ ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకోవడంలోనూ వెనుకబడ్డారని, సీనియర్లయిన మాజీలతో తలపడాల్సి వచ్చిన చోట్ల జూనియర్‌ ఎమ్మెల్యేల పాట్లు అన్నీ ఇన్నీ కావని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

తొలిసారి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో హంగ్‌ ఫలితాలిలా.. 
» మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ కంటే రెండు వార్డులే ఎక్కువ వచ్చాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. ఇదే నియోజకవర్గంలోని కేసముద్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు సమాన స్థాయిలో వార్డులు వచ్చాయి.  
» పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌కే ఎక్కువ వార్డులు వచ్చాయి.  
»  ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ బీఆర్‌ఎస్, బీజేపీల కంటే తక్కువ స్థానాల్లో ఆ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు.  
»  ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఉన్నప్పటికీ ఆ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు.  
»  ముథోల్‌ నియోజకవర్గంలోనూ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా భైంసా మున్సిపాలిటీలో ఆ పార్టీ గెలిచింది కేవలం ఆరు వార్డు స్థానాలనే.  
»  సిర్పూర్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా దాని పరిధిలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల కంటే తక్కువ స్థానాల్లో కమలం పార్టీ గెలిచింది.  
»  జనగామలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్‌ పార్టీ కంటే ఒక స్థానం ఎక్కువగా 13 వార్డుల్లో గెలిచినా మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు.  
»  వర్ధన్నపేటలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు కూడా తన మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు గెల్చుకోలేకపోయారు.  
»  నారాయణపేట నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి పట్టు ప్రదర్శించలేకపోయారు. అక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్‌కు రెండు వార్డులు తక్కువ వచ్చాయి.  
»  కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమనగల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే వార్డు రావడం గమనార్హం. 
» మెదక్‌ నుంచి మైనంపల్లి రోహిత్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నా.. కాంగ్రెస్‌ పార్టీకి అక్కడ ఆధిక్యత లభించలేదు.  
»  దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్‌ కూడా తడబడిన ఫస్ట్‌ టైం ఎమ్మెల్యేల్లో ఉన్నారు. ఆయన నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వచి్చనా మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు.  
»  కోరుట్ల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడ బీజేపీ కంటే నాలుగు స్థానాలు తక్కువ వచ్చాయి. అక్కడ కాంగ్రెస్‌కు కూడా బీఆర్‌ఎస్‌తో సమానంగా వార్డులు వచ్చాయి.  
»  వేములవాడలో ఆది శ్రీనివాస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే రెండు కౌన్సిలర్‌ స్థానాలు తక్కువ పడ్డాయి. అయితే ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోయినా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌కు రావడం గమనార్హం.  
»  హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, జమ్మికుంటలో మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు.  
»  కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఆ పార్టీ తక్కువ వార్డుల్లో గెలిచింది.  
»  ఆలంపూర్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు ఉన్నా అక్కడ కాంగ్రెస్‌ పార్టీతో సమానంగా మాత్రమే వార్డులు దక్కించుకోగలిగారు.  
»  చెన్నూరులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న వివేక్‌ కూడా తన నియోజకవర్గ కేంద్రంలో మెజార్టీ సాధించలేకపోయారు. 

కమలం పార్టీలో కంగారు.. 
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కొత్త కంగారు మొదలైంది. పట్టణ ప్రాంత ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారనే అంచనాలతో కోటి ఆశలతో వెళ్లిన ఆ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. అసలే ఓటింగ్‌ శాతం తగ్గి కేవలం ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితమైన బీజేపీలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఫస్ట్‌ టైమర్లే. 

రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు గతంలోనూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మిగిలిన ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జెయింట్‌ కిల్లర్‌గా అవతరించిన వెంకటరమణారెడ్డి (కామారెడ్డి)తో సహా హరీశ్‌బాబు (సిర్పూర్‌), పాయల్‌ శంకర్‌ (ఆదిలాబాద్‌), రామారావు పవార్‌ (ముథోల్‌), పైడి రాకేశ్‌రెడ్డి (ఆర్మూరు), ధన్‌పాల్‌ సూర్యనారాయణ (నిజామాబాద్‌ అర్బన్‌)లు తమ నియోజకవర్గాల్లోని పట్టణ ప్రజల ఆదరణ పొందలేకపోయారు. ఇక బీజేఎల్పీ నాయకుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌) కూడా తన పట్టు నిరూపించుకోలేక చతికిలపడాల్సి వచ్చింది. 

ఈ ఎమ్మెల్యేలు మాత్రం ‘గెలిచారు’ 
మొదటిసారి గెలిచినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు పట్టణ ఓటర్ల ప్రజాదరణ పొందగలిగారు. ఈ జాబితాలో మేడిపల్లి సత్యం (చొప్పదండి), వీర్ల శంకరయ్య (షాద్‌నగర్‌), మట్టా రాగమయి (సత్తుపల్లి), జైవీర్‌రెడ్డి (నాగార్జునసాగర్‌), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), బి.లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ) తదితరులున్నారు. ఇక మొదటిసారి గెలిచి మంత్రులుగా పనిచేస్తున్న పొన్నం ప్రభాకర్‌ (హుస్నాబాద్‌), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (ధర్మపురి)లు కూడా తమ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థల్లో మంచి విజయాలు సాధించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ నియోజకవర్గ కేంద్రంలో అయితే అన్ని వార్డులనూ కాంగ్రెస్‌ పార్టీనే గెలుచుకుంది.  

సీనియర్లు కొందరు సైతం.. 
సీనియర్లు కొందరు ఈ మున్సిపల్‌ ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్నారని ఫలితాలను బట్టి తెలుస్తోంది. తమ అనుభవంతో నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో వారు పార్టీని గెలిపించగలిగారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర, శ్రీధర్‌బాబు, గడ్డం ప్రసాద్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రధాన ప్రతిపక్షంలోని కేసీఆర్, కేటీఆర్‌లు ఈ జాబితాలో ఉన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement