మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరొక నలుగురు సహచరులతో సహా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జి మామిడి వలస దగ్గర అడవుల్లో నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారని పోలీ సులు ప్రకటించారు. ఉద్యమ జీవితంలో హిడ్మా కార్యకలాపాలపై చర్చ జరుగు తున్నది. హిడ్మా అంతంతో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కొన్ని సామా జిక పరిణామాలకు అంతం ఉండదు. ఒక రూపంలో అంతమైనదను కున్నది మరొక రూపంలో ప్రారంభమవుతుంది. ఒక అంతం అనేక ప్రశ్నలను లేవనెత్తి కొత్త ప్రారంభాలకు దారి తీస్తుంది.
ఉద్దేశపూర్వక హత్య
మొట్టమొదటి ప్రశ్న. అది నిజమైన ఎన్‌కౌంటరేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో 1969లో మొదలైన ఎన్‌కౌంటర్ కథనాల్లో నూటికి తొంభైæ అబద్ధాలని ఇప్పటికే సమాజానికి తేటతెల్లమ యింది. ఎన్‌కౌంటర్ అంటే అనుకోకుండా ఎదురుపడటం అనే భాషాపరమైన అర్థాన్ని తలకిందులు చేసి, పట్టుకొని ఉద్దేశపూర్వ కంగా చంపడం అనే అర్థాన్ని పోలీసులు స్థిరపరిచారు. ‘ఎన్‌కౌంటర్ చేస్తాం’ అని పోలీసులే అనడం, కొన్ని సందర్భాలలో బాధితులు కూడా ‘నేరస్థులను’ ఎన్‌కౌంటర్ చేయమని కోరడం చూస్తే ఆ మాట సంతరించుకున్న కొత్త అర్థం స్పష్టమవుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లో 2024 జనవరి 1న మొదలై వరుసగా కొనసాగు తున్న మావోయిస్టు నిర్మూలనా కార్యక్రమం నుంచి తప్పించుకోవ డానికి, లేదా ఆరోగ్య కారణాల కోసం కొందరు మావోయిస్టులు ఇతర చోట్ల తలదాచుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో విజయ వాడతో సహా కొన్ని పట్టణాలలో పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు జరిగాయి. అందులో భాగంగానే హిడ్మానూ, ఇతరులనూ పట్టుకుని, వారిని రెండు విడతలుగా కాల్చి చంపారని బలమైన అనుమానాలున్నాయి.
‘హిడ్మా లొంగిపోయినా వదలం, చంపుతాం’ అని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు గతంలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు, పోలీసు అధికారులు హిడ్మా పేరు పెట్టి మరీ హెచ్చ రికలు జారీ చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు స్వయంగా హిడ్మా తన చేతులతో జరిపినట్టు కథనాలు ప్రచారంలో పెట్టారు. వ్యవస్థ మార్పునకు సాయుధ పోరాటం అనివార్యమనే విశ్వాసంతో, దీర్ఘ కాలిక ప్రజాయుద్ధం జరుపుతున్న, సమష్టి నిర్ణయాలతో నడిచే ఒక పార్టీ నాయకత్వంలో జరిగిన ఘటనలను అలా ఒక వ్యక్తికి కుదించడం, ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి, ఎప్పుడైనా భవి ష్యత్తులో ఆయనను చంపితే సమర్థన సమకూర్చుకోవడానికి మాత్రమే! అందువల్ల హిడ్మాది నిజమైన ఎన్‌కౌంటర్ కన్నా ఎక్కు వగా ఉద్దేశపూర్వక హత్య కావడానికే అవకాశం ఉంది.
దేశ ప్రజల సమస్య
రెండో ప్రశ్న. మరి అలా పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా? ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ప్రత్యేకించి అందులోని అధికరణం 21 పేర్కొన్న జీవించే స్వేచ్ఛ పట్ల గౌరవం ఉంటే ఆ అధికారం ఉండదు. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా మనిషి ప్రాణాలు తీసే హక్కు రాజ్యానికి లేదని, పౌరులందరికీ జీవించే హక్కు ఉందని చెప్పే ఆ అధికరణాన్ని ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఉల్లంఘి స్తూనే ఉన్నాయి. చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో విచారణ జరిపి, సహేతుకమైన సందేహాలకు తావులేని రీతిలో శిక్ష విధించడం. ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు, విచా రణ లేదు, సహేతుకమైన సందేహాలు లెక్కలేనన్ని ఉన్నాయి. శిక్ష, అదీ తిరిగి మార్చడానికి వీలులేని మరణశిక్ష మాత్రం అమలైంది.
మూడో ప్రశ్న. హిడ్మా మీద ప్రత్యేకంగా, ఆదివాసుల మీద మొత్తంగా ఈ దాడి ఎందుకు? సుక్మా జిల్లా మారుమూల గ్రామం పువ్వర్తిలో పుట్టి పెరిగిన ఆదివాసి యువకుడు హిడ్మా మీద ఎక్కు పెట్టిన ఈ దాడి, గతం నుంచీ ఆదివాసుల మీద మొత్తంగా సాగు తున్న దాడులలో భాగమే. దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పథకంలో భాగంగా, పాలకులు ఆదివాసులను భయోత్పాతంలో ముంచి, వారి ఆవాసాల నుంచి బేదఖలు చేయదలచు కున్నారు. ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించి, అడవిలో, కొండల్లో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం రెండు మూడు దశాబ్దాలుగా సాగుతున్నది. దానికి అడ్డుగా ఉన్నారనే హిడ్మాను, జల్ జంగల్ జమీన్ ఆకాంక్షను, విప్లవోద్య మాన్ని నిర్మూలించదలచారు. అంటే ఇది ఆదివాసుల సమస్యో, మావోయిస్టుల సమస్యో కాదు, ఈ దేశ ప్రజల సమస్య, ఈ దేశ భవిష్యత్తు సమస్య.
పోరాట ధార ఆగేదా?
నాలుగో ప్రశ్న. హిడ్మా విషయంలో ప్రభుత్వ ప్రచారం గెలి చిందా, ఓడిందా? హిడ్మాను ఎంత భయంకరుడిగా చూపడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వచ్చినా, ఆయన హత్య తర్వాత వెల్లు వెత్తుతున్న నిరసన, పువ్వర్తిలో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది హాజరై ఘన నివాళి అర్పించడం ఆయన ఆదివాసుల హృద యాల్లో ఎటువంటి స్థానం సంపాదించాడో చూపుతున్నది. ఆదివా సుల గూడాలు తగుల బెడుతూ, విచ్చలవిడిగా హత్యలు, అత్యాచా రాలు చేసిన సాల్వా జుడుమ్ దుర్మార్గాన్ని క్రియాశీలంగా ఎదు ర్కొన్న నాయకులలో ఒకరుగా ఆదివాసులలో ఆయనకు చెరగని స్థానం ఉంది. దాదాపుగా అన్ని ఆదివాసీ సమూహాల భాషలూ ధారాళంగా మాట్లాడుతూ వారికి తలలో నాలుక అయ్యాడు గనుక ఆయన పట్ల అపార గౌరవం ఉంది.
ఐదో ప్రశ్న. హిడ్మా అంతంతో ఉద్యమం అంతమవుతుందా? ఆదివాసులకు నవంబర్ 18 వరకూ సజీవంగా నాయకత్వం వహించిన మాడ్వి హిడ్మా, ఆనాటి నుంచీ వందలాది ఆదివాసీ అమర పోరాట యోధుల చారిత్రక జాబితాలో చేరాడు. కానూ, సిద్ధూ, వీరనారాయణ సింగ్, బిర్సా ముండా, తిలక్ మాంఝీ, రాంజీ గోండు, గుండాధుర్, కొమురం భీమ్ వంటి ఉత్తేజకర, స్ఫూర్తి దాయక జాబితా అది. వాళ్లకు, వాళ్ల స్ఫూర్తికి మరణం లేదు. మొదట బ్రిటిష్ వలసవాదుల మీద, మైదాన ప్రాంతాల దోపిడీదారుల మీద, భూస్వాముల మీద, ఆ తర్వాత ‘అభివృద్ధి’ పేరుతో జల్ జంగల్ జమీన్ కొల్లగొట్టి తమను నిర్వాసితులను చేసిన ప్రభుత్వాల మీద ఆదివాసుల పోరాటాలు మూడు శతాబ్దాలుగా జరుగుతున్నాయి. దోపిడీ, పీడనలు ఉన్నంతవరకూ ఆ పోరాట ధారకు అంతం ఉండదు.
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు – ‘వీక్షణం’ ఎడిటర్


