ఈ ప్రాణబంధం ఏమిటో అర్థం కాకుండా ఉంది. 74 ఏళ్ల వయసులో 10వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా, నా 26వ ఏట తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన రోజు నాలో ఉన్నప్పటి ఆ కొత్త లోతైన ఆనందపు అనుభూతే నేటికీ పరవళ్లు తొక్కుతూ ఉంది! ఆ మాటే విజయ్ చౌధరీతో అన్నాను.
‘‘పరవళ్లు తొక్కటం మంచి విషయం నితీశ్‌జీ. అయితే, ఆ పరవళ్లు పక్కనున్న వాళ్ల కాళ్లను తొక్కేస్తున్నాయేమో కాస్త గమనించుకుంటూ ఉండాలి’’ అన్నారాయన, నవ్వుతూ. ‘‘అయ్యో, సారీ విజయ్! మీ కాలును తొక్కేశానా?’’ అన్నాను నవ్వుతూ.
‘‘లేదు నితీశ్‌జీ, మీరు నా కాలును తొక్కలేదు. గాంధీ మైదాన్ వేదిక పైన మీ పక్కనున్న మోదీజీ కాలును తొక్కినంత పని చేశారు! మీకై మీరు మీ చేత్తో ఆయన చేతిని గాల్లోకి లేపకుండా, ఆయనకై ఆయనే ఆయన చేత్తో మీ చేతిని గాల్లోకి లేపేవరకు మీరు ఆగవలసింది’’ అన్నారు విజయ్.
మోదీజీ చేతిని పట్టుకుని బలవంతంగా పైకెత్తటం అంటే మోదీజీ కాలును చూసు కోకుండా తొక్కేయటమేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు నాకు అర్థమైంది.
వయసులో ఏడేళ్లు చిన్నవాడే అయినా, సూక్ష్మాన్ని పట్టుకోవటంలో నా కంటే పెద్దవాడు విజయ్ కుమార్ చౌధరీ. పార్టీలో విజయ్ నా సన్నిహితుడు, మంత్రి వర్గ సహచరుడు. విజయ్‌లాగే రామచంద్ర ప్రసాద్ సింగ్ అనే మరొక సన్నిహితుడు కూడా ఉండేవారు. ఆయన నా ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా! ఇప్పుడు లేరు.
విజయ్ నాకు లెఫ్ట్‌లో ఉంటే, రామచంద్ర నాకు రైట్‌లో ఉండేవారు. రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి పదవి కోసం రామచంద్ర రైటిస్టుగా మారి, బీజేపీలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి కూడా వెళ్లిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సొంత పార్టీని కూడా తీసుకెళ్లి ప్రశాంత్ కిశోర్ పార్టీలో కలిపేసుకున్నారు. చివరికి ఆయన ఏమయ్యారో తెలీదు!
లెఫ్ట్–వింగ్‌లోని వాళ్లు రైట్–వింగ్‌లోకి వెళ్లటంలో తప్పేమీ లేదు. కానీ, రైట్ టైమ్‌లో వెళ్లాలి. రైట్ టైమ్‌లో వెనక్కి వచ్చేయాలి. అది తెలుసుకున్నట్లు లేరు రామచంద్ర. తొలిసారి నేను 2000లో ఎన్డీయేతో కలిశాను. మాటా మాటా వచ్చి, ఏడు రోజుల తర్వాత ఎన్డీయేలోంచి వచ్చేశాను. రెండోసారి 2005లో ఎన్డీయేలోకి వెళ్లాను. 2013లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చాను. 2017లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను. తిరిగి 2022లో ఎన్డీయేలోంచి వచ్చేశాను. 2024లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను.
అవసరమైతే ఇప్పటికిప్పుడైనా, ఎన్డీయేలోంచి బయటికి వచ్చేయగలను నేను. ప్రజల కోసం ఎన్నిసార్లైనా వెళ్లి, ఎన్నిసార్లైనా వెనక్కు వచ్చేయాల్సిందే. ఎంత మందితో ఎన్ని మాటలైనా అనిపించుకోవలసిందే!
శరద్ యాదవ్ నన్ను ‘ఫాల్తూ’ మనిషి అనేవారు. లాలూజీ నన్ను ‘పల్టూ రామ్’ అని అంటుంటారు. మీడియా నన్ను ‘సుశాసన్ బాబు’ అంటుంది. ఈ పేర్లేవీ నన్ను పైనుంచి పడేసేవీ, రథమెక్కించి ఊరేగించేవీ కాదు. ప్రజా జీవితం ఒక పేరుతో ముగిసిపోయేదీ, ఒక టెర్మ్‌తో తీరిపోయేదీ కాదు.
‘నితీశ్‌జీ... కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరే ఎందుకు ఉండాలి? నలుగురు ఉండొచ్చు కదా అని మనవాళ్లు అడుగు తున్నారు’’ అన్నారు విజయ్.
ఇప్పుడున్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్లు. జేడీయు నుంచి కూడా ఇద్దరు ఉండాలని పట్టుబడితే... ‘మొత్తం నలుగురూ మీవాళ్లనే ఉప ముఖ్యమంత్రులుగా ఉండ నివ్వండి. సీఎం పోస్టు ఒక్కటీ మాకు ఇవ్వండి’ అని మోదీజీ అనొచ్చు. బీజేపీకి వచ్చినవి 89. జేడీయూకు వచ్చినవి 85.
ఇరవై ఏళ్లుగా బిహార్‌లో బీజేపీ పవర్‌లో లేదు. ఇరవై ఏళ్లుగా బిహార్‌లో బీజేపీ లేకుండా పవరూ లేదు!
‘‘ఇప్పుడు కాదులే విజయ్’’ అన్నాను.
‘మరెప్పుడు?’ అన్నట్లేం చూడలేదు విజయ్.
-మాధవ్ శింగరాజు


