అభిప్రాయం
2026 మార్చ్ 31 నాటికి, ‘నక్సలిజం లేని భారత్‌ని ఏర్పాటు చేస్తాము’– అని, దేశ ప్రధానీ, హోమ్ మంత్రీ కూడా పదే పదే ప్రకటిస్తున్నారు. నక్సలైట్లు ‘లొంగే వరకూ, లేదా పట్టుబడేవరకూ, లేదా నిర్మూలనం అయ్యేవరకూ, తమ ప్రభుత్వం నిద్రపోదు’ అని కూడా ప్రక టించారు. అందుకోసం అనేక రకాల పేర్లతో, పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఆ పేర్లలో ఒకటి ‘కోబ్రా’ (నాగు బాము) దళం, ఇంకోటి ‘గ్రే హౌండ్స్’ (వేట కుక్కల) దళం. ‘గ్రే హౌండ్స్’ అనేవి ఒక జాతి కుక్కలు. ప్రాచీన ఈజిప్టులో, వేటల కెళ్ళినప్పుడు, జంతువుల్ని పట్టెయ్యడానికి, ఆ కుక్కల్ని ఉపయోగించేవారట!
ఇప్పుడు, నక్సలైట్లని పట్టుకోవడానికి, పోలీసు దళాల్ని అదే పేరుతో ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నారు! నిన్న గాక మొన్న, ఈ పేరుగలిగిన పోలీసు దళం వాళ్ళే, ఆదివాసీల తరఫున పోరాడు తున్న నక్సలైట్ల నాయకుల్ని చాలా మందిని చంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చదివాక, నాకు వచ్చిన ఆలోచనలు కొన్ని ఇవి:
పరస్పర శత్రుత్వం వెనక...
(1) నేను తెలుగులో, 1978లో, పరిచయం చేసిన ‘అంకుల్ టామ్స్ కేబిన్’ (‘టామ్ మామ ఇల్లు’) అనే ఒక ఇంగ్లీషు నవలలో చదివిన ఒక ‘వ్యాపార ప్రకటన’ ఈ సందర్భంలోనే కాదు, ఎప్పుడూ గుర్తే వస్తుంది. అమెరికాలో, నీగ్రోల బానిసత్వం కొనసాగుతున్న కాలంలో, బానిసలుగా ఉండటం ఇష్టం లేని శ్రామికులు పారిపోతే, వారిని వెతికి పట్టుకోవడానికి, వారి యజమానులు నిజం వేట కుక్కల్ని వాడేవారు. వాటికి సంబంధించినదే ఆ వ్యాపార ప్రకటన! దాని హెడ్డింగు: ‘నీగ్రో కుక్కలు!’ ఆ ప్రకటనలో ఇలా వుంది:
‘‘నగర వాసులందరికీ, ఈ క్రింద సంతకం చేసిన వ్యక్తి విన్నవించుకొనేదే మనగా– ‘నేను మన్రో రోడ్డులో తూర్పున రెండున్నరమైళ్ళ దూరాన నివసిస్తున్నాను. నా దగ్గిర, నీగ్రోల్ని పట్టుకోడానికి చాలా మంచి కుక్కలు ఉన్నాయి! పారిపోయిన నీగ్రోల్ని పట్టుకోవాలని కోరే వ్యక్తులు నాకు ఒక్క పిలుపు ఇస్తే చాలు. నేను వేటకెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో నా నివాసంలోనే ఉంటాను. నేను లేక పోయినా, నా నివాసం దగ్గర నా సమాచారం మీకు అందుతుంది. నీగ్రోని పట్టుకున్న కుక్క కోసం– 25 డాలర్లు. నీగ్రోని పట్టుకోక పోతే 5 డాలర్లు మాత్రమే’. – ఇట్లు, గాఫ్. ఫిబ్రవరి 17, 1852.’’ – ఇదీ ఆ ప్రకటన!
ఎంత ఆశ్చర్యం! అక్కడ, ఆ నాడు, 170 ఏళ్ళనాడు, స్వేచ్ఛ కోసం పారిపోయిన బానిసల్ని పట్టుకోవడానికి, ఆ నాటి బానిస యజమానులు వేటకుక్కల్ని ఉపయోగించారు. ఈనాడు, ఉద్యమ కారులు తప్పించుకుంటూ, ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి, భద్రమైన స్థలాలకు వెళ్తూ వుంటే, ఈ ప్రభుత్వ పాలకులు, వేట కుక్కల పేరుతో వున్న పోలీసుల దళాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ పోలీసుల గురించి, కవి చెరబండరాజు, ఒక పాటలో ఇలా చెప్పాడు: ‘‘మాలోని మనిషివే! మా మనిషివే నీవు!/ పొట్ట కూటికి నీవు పోలీసువైనావు!’’ నిజానికి పోలీసులంటే ఎవరు? వారూ మానవులే! శ్రామిక కుటుంబాలనించీ వచ్చిన వారే! సైనికుల లాగే, యజమానులు ఆజ్ఞాపించే ‘బలప్రయోగం’ అనే శ్రమ చేస్తూ, వచ్చిన జీతాలతో బతుకుతారు.
ఈ పోలీసుల గురించి, మార్క్స్ మాటల్లో చెప్పాలంటే, ‘‘తప్పుడు సామాజిక సంబంధాల కారణంగా దోపిడీ సమాజానికి అవసరమైన అనుత్పాదక శ్రామి కులు.’’ అంటే, ‘శ్రమ దోపిడీ’ అనే తప్పుడు సామాజిక సంబంధాల వల్లే, సమాజంలో వర్గాలూ, వర్గాల మధ్య ఘర్షణలూ తలెత్తు తాయి! వాటిని నివారించడానికీ, శ్రమ దోపిడీని సాఫీగా సాగ నివ్వడానికీ నిరంకుశ ప్రభుత్వాలు, సాయుధ భటులతో అణిచి వేయడం అన్నది బానిస యజమానుల కాలం నించీ వస్తున్నదే! ఆనాటి సాయుధ భటులకు బదులుగా ఈ నాడున్నది ‘పోలీసులు’! పత్రికల్లో, ఈ వార్తలు చదివే పాఠకులు గ్రహించ వలిసింది ఏమిటంటే: ఆ నాడైనా, ఈ నాడైనా, పాలకులు, ప్రజల్లోనే వున్న రెండు భాగాలను, (వృత్తి ధర్మం పేరుతో, ఇటు పోలీసులనూ; శాంతి భద్రతల పేరుతో, అటు శ్రమ దోపిడీని అడ్డుకునే నక్సలైటు ఉద్యమకారులనూ) శత్రువులుగా నిలబెట్టి, పరస్పరం సంఘర్షించు కునేలా చేస్తారు!
ఆ సంఘర్షణలో, ప్రాణాలు పోగొట్టుకునేది ఇటు పోలీసులూ, అటు ఉద్యమకారులూనూ. ఇరు పక్షాల కుటుంబాలూ ఎంతో క్షోభని అనుభవిస్తాయి! బిరుదులతోనూ, ఎవార్డులతోనూ, రివార్డులతోనూ, ఆ క్షోభని తగ్గించలేరు! అందుచేత, సమాజం బాగుపడాలని కోరుకునే ఎవ్వరైనా అనుకోవలిసింది: ‘నక్సలిజం లేని భారత్ కాదు, శ్రమ దోపిడీ లేని భారత్’ కావాలి!– అని.
విమర్శకు అతీతులా?
(2) ‘మరి నక్సలైట్లు అనుసరించే రాజకీయ పంథాని విమర్శించవద్దా’ అని ఎవరైనా అడగవచ్చును. తప్పులున్నప్పుడు, తప్పకుండా విమర్శించవలిసిందే! ‘మావోయిస్టులూ! మీ అంతిమ లక్ష్యం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, మంచిదే! కానీ ఎన్నెన్నో పోరా టాల తర్వాత, తప్పనిసరిగా చెయ్యవలిసి వచ్చే ‘ఆయుధాల’ పోరా టాన్ని, ప్రారంభంలోనే మొదలు పెడితే, మీది ‘వామపక్ష బాలా రిష్టమే’ అవుతుంది – అని విమర్శించవలిసిందే! దీన్ని బట్టి రాజ కీయంగా, నక్సలైట్లు ఇంకా శైశవ దశలోనే వున్నారనుకోవాలి. ఒక హిందీ కవి శిశువుల గురించి ఇలా చెపుతాడు: ‘శిశువు పడుతూ, పడుతూ, నడవడం నేర్చుకున్నాడు! శిశువు ఏడుస్తూ, ఏడుస్తూ, నవ్వడం నేర్చుకున్నాడు!’ (‘శిశూ నే గిర్ గిర్ కర్, చల్నా సీఖా! రో రోకర్, హస్నా సీఖా!). భవిష్యత్తులో ఈ ఉద్యమకారులు కూడా శిశువుల లాగే నేర్చుకుంటారని ఆశించాలి.
ఏం మారిందని?
(3) ఇంకో వార్త! లొంగిపోకుండా తప్పించుకు తిరిగే ఉద్యమ కారులకు, వారి తలకి కొంత వెలకట్టి, వారిని పట్టిచ్చిన వారికి కొన్ని లక్షల బహుమతీ, ఒక ఉద్యోగమూ ఇస్తామని ప్రభుత్వ ప్రక టనలు కూడా వున్నాయి. (‘ది ఎకనామిక్ టైమ్స్’, 16–4–2024). ఇలాంటి ప్రకటనలు, అమెరికాలో బానిసత్వం వున్న రోజుల్లో (1619–1865), కూడా వున్నట్టు, ‘అంకుల్ టామ్స్ కేబిన్’ నవల చెపుతుంది. ఆ ప్రకటన హెడ్డింగు: ‘25 డాలర్ల బహుమానం!’ ప్రకటన ఇలా వుంది: ‘‘అక్టోబర్ 17న బానిస ఒకడు పారిపోయాడు.
పేరు యాలెన్. వయస్సు 23 సం.లు. ఎత్తు 6 అడుగులు. రంగు ములాటో. కుక్క పీకిన మచ్చలుంటాయి. లావెల్ పాంటూ, కాటన్ షర్టూ ఒంటి మీద ఉన్నాయి. బాగా చదవలేడు. చిన్న చిన్న పదాలు రాస్తాడు. చిన్న చిన్న లెక్కలు చేస్తాడు. మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉంటాడు. తొందరగా మాట్లాడుతాడు. జైల్లో పెట్టి, నాకు తెల్పండి. ఇట్లు – చీతం, నవంబరు 6, 1852.’’ అంటే, యజమానుల కోసం పనిచేసే ప్రభుత్వాల చర్యల్లో అప్పటికీ, ఇప్పటికీ ఏదైనా తేడా వుందా? ఎప్పుడో, 175 ఏళ్ళ నాడే, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’లో చెప్పినట్టు, ‘‘ప్రభుత్వం అనేది, పెట్టు బడిదారీ వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే కమిటీ మాత్రమే!’’

రంగనాయకమ్మ
వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి


