breaking news
e-pharmacy
-
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఔషధ మార్కెట్‌పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్‌లో టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్‌లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్లైన్ విక్రయాలకు అనుమతించింది. రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్నూ, ఇటు జెనరేషన్ జెడ్నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు -
రిలయన్స్ కార్ట్‌లో నెట్‌మెడ్స్!
బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణ ప్రణాళికలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను ప్రీమియం రేటుకు విక్రయించిన రిలయన్స్ ఈసారి ఆన్లైన్ ఫార్మా సేవల సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 150 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,150 కోట్లు) ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చివరి విడత నిధుల సమీకరణ సమయంలో నెట్‌మెడ్స్‌కి లభించిన వేల్యుయేషన్ కన్నా కాస్త ప్రీమియం రేటు చెల్లించవచ్చని పేర్కొన్నాయి. దీంతో పాటు కార్యకలాపాల విస్తరణకు మరిన్ని నిధులు కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్ ఈ డీల్ పూర్తి చేయొచ్చని వివరించాయి. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడానికి ముందు నుంచే రిలయన్స్, నెట్‌మెడ్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు రిలయన్స్, నెట్‌మెడ్ వర్గాలు నిరాకరించాయి. కొత్త వ్యాపార అవకాశాల మదింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై వ్యాఖ్యానించలేమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు ప్రదీప్ దాధా పేర్కొన్నారు. కస్టమర్లకు నిత్యావసరాలు మొదలైన వాటి సరఫరా కోసం మాత్రమే ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. జోరుగా విస్తరణ .. ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ (ఓ2ఓ) వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నెట్‌మెడ్స్‌తో డీల్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపారాల విస్తరణలో భాగంగా ఇటీవలే రిలయన్స్ రిటైల్, వాట్సాప్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్ టెలికం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ 9.99 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 5.7 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇక కంపెనీల కొనుగోళ్లపైనా రిలయన్స్ భారీగానే వెచ్చిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2017 నుంచి ప్రధానంగా జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపార విభాగాల విస్తరణకు దాదాపు 3 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. సావన్, ఎంబైబ్, ఫైండ్, గ్రాబ్, హ్యాప్టిక్, రెవరీ, నౌఫ్లోట్స్ వంటి సంస్థలను కొనుగోలు చేసింది. ఫార్మాలో రిలయన్స్‌కు రెండో డీల్.. నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి.. ఫార్మా రంగంలో ఇది రెండో డీల్ కానుంది. గతేడాదే బెంగళూరుకు చెందిన సి–స్క్వేర్ ఇన్ఫో సొల్యూషన్స్‌లో రిలయన్స్ 82% వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 82 కోట్లు వెచ్చించింది. ఫార్మా రంగంలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సేల్స్ సిబ్బందికి అవసరమైన సాఫ్ట్వేర్ ను ఈ సంస్థ రూపొంది స్తుంది. అపోలో ఫార్మసీ, యాడ్‌కాక్ ఇన్‌గ్రామ్ వంటి కంపెనీలు దీనికి క్లయింట్లు. నెట్‌మెడ్స్ కథ ఇదీ.. ప్రదీప్ దాధా 2015లో నెట్‌మెడ్స్‌ను ప్రారంభించారు. ఆయన కుటుంబం.. సన్ ఫార్మాస్యూటికల్స్ ఔషధాలను తొలినాళ్లలో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని సన్ ఫార్మా కొనుగోలు చేసింది. నెట్‌మెడ్స్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 100 మిలియన్ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. దాధాల ఫ్యామిలీ ఆఫీస్‌తో పాటు హెల్త్‌కేర్ రంగ ఇన్వెస్టరు ఆర్బిమెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంఏపీఈ అడ్వైజరీ, సిస్టెమా ఆసియా ఫండ్, సింగపూర్‌కి చెందిన దౌన్ పెన్ కంబోడియా గ్రూప్ మొదలైనవి నెట్మెడ్లో ఇన్వెస్టర్లు. కొత్తగా మరో 12 గిడ్డంగుల ఏర్పాటు ద్వారా మొత్తం వేర్‌హౌస్‌లను 26కి పెంచుకోనున్నట్లు నెట్‌మెడ్స్ గతేడాది ప్రకటించింది. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం నెట్‌మెడ్స్ .. నెలవారీ లావాదేవీల యూజర్ల సంఖ్య సుమారు ఆరు లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయాల్లో దాదాపు 90 శాతం వాటా .. ప్రిస్క్రిప్షన్ ఔషధాలు, ఓవర్ ది కౌంటర్ ఔషధాల విక్రయాలదే ఉంటోంది. ఈ రంగంలో 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మ్ఈజీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్ర అనారోగ్యాలతో తరచూ ఔషధాలు తప్పనిసరిగా కొనుగోలు చేసే వర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఈ–ఫార్మా @ 6 బిలియన్ డాలర్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ఈ–ఫార్మా పరిశ్రమ (కన్సల్టెన్సీ, డయాగ్నాస్టిక్స్ కూడా కలిపి) ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 16 బిలియన్ డాలర్ల దాకా చేరొచ్చని అంచనా. ఇప్పటికే దాదాపు నలభై లక్షల పైగా కుటుంబాలు ఆన్లైన్లో ఔషధాలను కొనుగోలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ–ఫార్మా ప్లాట్‌ఫామ్ లపై సగటు కొనుగోలు లావాదేవీ విలువ రూ.1,400–1,700 స్థాయి లో ఉంటోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో లబ్ది పొందిన అతి కొద్ది రంగాల్లో ఈ–ఫార్మా పరిశ్రమ కూడా ఒకటి. -
నేడు మెడికల్ షాపులు బంద్
-
నేడు మెడికల్‌షాపులు బంద్
కర్నూలు(హాస్పిటల్): ఆన్లైన్ ఈ-ఫార్మసీ వ్యాపారానికి వ్యతిరేకంగా డ్రగ్ యాక్ట్‌లో చేస్తున్న మార్పులకు నిరసనగా ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా మెడికల్షాప్ల బంద్ పాటిస్తున్నట్లు సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణారావు తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం కర్నూలులోని కెమిస్ట్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్ ఈ-ఫార్మసీ అమలుతో ప్రస్తుత డ్రగ్స్, కాస్మోటిక్స్ యాక్ట్ 1940, రూల్స్ 1945కి వ్యతిరేకంగా చట్టబద్ధత, నాణ్యతలేని మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వైద్యుల పర్యవేక్షణలేని మందులు వాడటం వల్ల డ్రగ్ రియాక్షన్‌కు సంబంధించి దుష్ఫలితాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 30వతేదీ రాత్రి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 600 హోల్‌సేల్, 1470 రిటైల్ మెడికల్‌షాప్‌లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర మందుల కోసం ఫోన్( 9989766966, 9246472006, 9848024555)లో సంప్రదించాలన్నారు. విలేకరుల సమావేశంలో కర్నూలు జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి వై. పుల్లయ్య, కోశాధికారి ఎస్. మధుసూదన్‌గుప్త పాల్గొన్నారు.


