రిలయన్స్‌ కార్ట్‌లో నెట్‌మెడ్స్‌!

Reliance Industries may acquire majority stake in e-pharmacy Netmeds - Sakshi

మెజారిటీ వాటాల కొనుగోలుపై దృష్టి

రూ.1,150 కోట్ల దాకా డీల్‌ విలువ అనుబంధ సంస్థ ద్వారా కొనుగోలు 

తుది దశలో చర్చలు

బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాపార విస్తరణ ప్రణాళికలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను ప్రీమియం రేటుకు విక్రయించిన రిలయన్స్‌ ఈసారి ఆన్‌లైన్‌ ఫార్మా సేవల సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ సుమారు 150 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,150 కోట్లు) ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

చివరి విడత నిధుల సమీకరణ సమయంలో నెట్‌మెడ్స్‌కి లభించిన  వేల్యుయేషన్‌ కన్నా కాస్త ప్రీమియం రేటు చెల్లించవచ్చని పేర్కొన్నాయి. దీంతో పాటు కార్యకలాపాల విస్తరణకు మరిన్ని నిధులు కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్‌ ఈ డీల్‌ పూర్తి చేయొచ్చని వివరించాయి.  కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడానికి ముందు నుంచే రిలయన్స్, నెట్‌మెడ్స్‌ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

అయితే ఈ వార్తలపై స్పందించేందుకు రిలయన్స్, నెట్‌మెడ్‌ వర్గాలు నిరాకరించాయి. కొత్త వ్యాపార అవకాశాల మదింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, మార్కెట్‌ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమని రిలయన్స్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై వ్యాఖ్యానించలేమని నెట్‌మెడ్స్‌ వ్యవస్థాపకుడు ప్రదీప్‌ దాధా పేర్కొన్నారు. కస్టమర్లకు నిత్యావసరాలు మొదలైన వాటి సరఫరా కోసం మాత్రమే ప్రస్తుతం రిలయన్స్‌ రిటైల్‌తో జట్టు కట్టినట్లు వివరించారు.  

జోరుగా విస్తరణ ..
ఆన్‌లైన్‌–టు–ఆఫ్‌లైన్‌ (ఓ2ఓ) వ్యాపారాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నెట్‌మెడ్స్‌తో డీల్‌ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపారాల విస్తరణలో భాగంగా ఇటీవలే రిలయన్స్‌ రిటైల్, వాట్సాప్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్‌ టెలికం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం 5.7 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోంది. ఇక కంపెనీల కొనుగోళ్లపైనా రిలయన్స్‌ భారీగానే వెచ్చిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక ప్రకారం 2017 నుంచి ప్రధానంగా జియో, రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపార విభాగాల విస్తరణకు దాదాపు 3 బిలియన్‌ డాలర్ల దాకా వెచ్చించింది. సావన్, ఎంబైబ్, ఫైండ్, గ్రాబ్, హ్యాప్‌టిక్, రెవరీ, నౌఫ్లోట్స్‌ వంటి సంస్థలను కొనుగోలు చేసింది.  

ఫార్మాలో రిలయన్స్‌కు రెండో డీల్‌..
నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి.. ఫార్మా రంగంలో ఇది రెండో డీల్‌ కానుంది. గతేడాదే బెంగళూరుకు చెందిన సి–స్క్వేర్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌లో రిలయన్స్‌ 82% వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 82 కోట్లు వెచ్చించింది. ఫార్మా రంగంలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సేల్స్‌ సిబ్బందికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ను ఈ సంస్థ  రూపొంది స్తుంది. అపోలో ఫార్మసీ, యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ వంటి కంపెనీలు దీనికి క్లయింట్లు.

నెట్‌మెడ్స్‌ కథ ఇదీ..
ప్రదీప్‌ దాధా 2015లో నెట్‌మెడ్స్‌ను ప్రారంభించారు. ఆయన కుటుంబం.. సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఔషధాలను తొలినాళ్లలో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని సన్‌ ఫార్మా కొనుగోలు చేసింది. నెట్‌మెడ్స్‌ ఇప్పటిదాకా మూడు విడతల్లో 100 మిలియన్‌ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. దాధాల ఫ్యామిలీ ఆఫీస్‌తో పాటు హెల్త్‌కేర్‌ రంగ ఇన్వెస్టరు ఆర్బిమెడ్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ఎంఏపీఈ అడ్వైజరీ, సిస్టెమా ఆసియా ఫండ్, సింగపూర్‌కి చెందిన దౌన్‌ పెన్‌ కంబోడియా గ్రూప్‌ మొదలైనవి నెట్‌మెడ్‌లో ఇన్వెస్టర్లు.

కొత్తగా మరో 12 గిడ్డంగుల ఏర్పాటు  ద్వారా మొత్తం వేర్‌హౌస్‌లను 26కి పెంచుకోనున్నట్లు నెట్‌మెడ్స్‌ గతేడాది ప్రకటించింది. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ నివేదిక ప్రకారం ప్రస్తుతం నెట్‌మెడ్స్‌ .. నెలవారీ లావాదేవీల యూజర్ల సంఖ్య సుమారు ఆరు లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయాల్లో దాదాపు 90 శాతం వాటా .. ప్రిస్క్రిప్షన్‌ ఔషధాలు, ఓవర్‌ ది కౌంటర్‌ ఔషధాల విక్రయాలదే ఉంటోంది. ఈ రంగంలో 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మ్‌ఈజీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్ర అనారోగ్యాలతో తరచూ ఔషధాలు తప్పనిసరిగా కొనుగోలు చేసే వర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి.

ఈ–ఫార్మా @ 6 బిలియన్‌ డాలర్లు
కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ నివేదిక ప్రకారం ఈ–ఫార్మా పరిశ్రమ (కన్సల్టెన్సీ, డయాగ్నాస్టిక్స్‌ కూడా కలిపి) ప్రస్తుతం 1.2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 16 బిలియన్‌ డాలర్ల దాకా చేరొచ్చని అంచనా. ఇప్పటికే  దాదాపు నలభై లక్షల పైగా కుటుంబాలు ఆన్‌లైన్‌లో ఔషధాలను కొనుగోలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ–ఫార్మా ప్లాట్‌ఫామ్‌ లపై సగటు కొనుగోలు లావాదేవీ విలువ రూ.1,400–1,700 స్థాయి లో ఉంటోంది. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తితో లబ్ది పొందిన అతి కొద్ది రంగాల్లో ఈ–ఫార్మా పరిశ్రమ కూడా ఒకటి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top