breaking news
darshan timings
-
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కోవిడ్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. గురువారం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రాతఃకాల అర్చన, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. ఖడ్గమాలార్చన సమయంలో ఒక క్యూలైన్లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ క్యూలైన్ ద్వారా ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులను అత్యవసరం అయితే దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రాత్రి నిద్ర చేసే భక్తులు తెల్లవారుజామున లేచి అమ్మవారిని దర్శించుకుని తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరుతారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఉదయం 6 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి అనుమతించేవారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైళ్లు అందుకోలేక ఇబ్బందులు పడేవారు. దీనిపై వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులతో చర్చించిన ఈవో దర్శన వేళలను మార్పు చేశారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. -
పద్మావతీ అమ్మవారి దర్శన సమయం పొడిగింపు
తిరుచానూరు : వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తడం సర్వసాధారణం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుచానూరులో కొలువైన శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి(అలిమేలు మంగమ్మ)ని కూడా దర్శించుకుంటారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి దర్శన సమయాన్ని ఏప్రిల్ 15వ తేదీ నుంచి మరోగంట పొడిగించారు. సాధరణంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయాన్ని ఉదయం 5గంటలకు తెరిచి రాత్రి 9.30గంటలకు మూసివేసేవారు. దర్శన సమయాన్ని పొడిగించడంతో జూన్ నెలాఖరు వరకు రాత్రి 10.30 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఆలయంలోకి వెళ్లేందుకు రాత్రి 10 వరకు భక్తులను అనుమతిస్తారు. అదేవిధంగా ఆలయంలో ఏకాంత సేవను ప్రతిరోజు రాత్రి 8.45 (శుక్రవారం మాత్రం రాత్రి 9.15) గంటలకు నిర్వహించేవారు. అయితే జూన్ నెలాఖరు వరకు రాత్రి 9.45గంటలకు ఏకాంతసేవను నిర్వహించనున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్ధం రాత్రి 10.30గంటల వరకు తిరుచానూరు-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను టీటీడీ కోరింది. -
అంగారిక సంకష్టికి..అంతా రెడీ
సాక్షి, ముంబై : ముంబై ప్రభాదేవిలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన సిద్ధివినాయకుని ఆలయంలో అంగారికి సంకష్టి కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆరు నెలలకోసారి వచ్చే ఈ సంకష్టి ఈ సారి జూలె 15వ తేదీ మంగళవారం వచ్చింది. దీన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాం తాల నుంచి లక్షలాది మంది భక్తులు సిద్దివినాయకున్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేం దుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శన వేళలు * సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు * మళ్లీ 3.50 నుంచి రాత్రి 8.10 వరకు * రాత్రి 10.55 నుంచి అర్ధరాత్రి 2.00 గంటల వరకు మహాపూజ, హారతి వేళలు * సోమవారం అర్ధరాత్రి 12.10 నుంచి 1.30 వరకు * మంగళవారం తెల్లవారు జాము 3.15 నుంచి 3.50 గంటల వరకు * మంగళవారం రాత్రి 8.55 నుంచి 10.55 గంటల వరకు రోజు వారి పూజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు సిద్ధివినాయకుని దర్శనం కోసం ఆలయం ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. తెల్లవారుజాము 3.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు, అనంతరం రాత్రి 101.5 గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు గర్భగుడిలోకి భక్తులకు అనుమతిస్తారు. ఇక కాకడ్ హారతి, మహాపూజను అర్ధరాత్రి 12.10 గంటల నుం చి అర్ధరాత్రి 1.30 గంటల వరకు, తెల్లవారుజాము 3.15 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు హారతి, రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు మహాపూజతోపాటు నైవేద్యం, హారతిని అందించనున్నారు. ప్రత్యేక వసతులు ముఖ్యంగా వికలాంగులు, గర్భిణులు, సీనియర్ సిటీజన్లు, పిల్లతల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరికోసం గేట్ నెంబర్ మూడు నుంచి లోనికి అనుమతించనున్నారు. మరోవైపు భక్తుల కోసం ఏర్పాటు చేసిన మండపంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడా ఫ్యాన్లు బిగించారు. అలాగే లైట్లు, తాగునీరు, టీ, అల్పాహారం, సంచార మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించా రు. మండపంలో అగ్నిమాపక పరికాలు అందుబాటులో ఉంచారు. ఒక ఫైరిం జన్, అంబులెన్స్, వైద ్య బృందం, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచారు. భక్తులు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని ట్రస్టీ విజ్ఞప్తి చేసింది. సిద్ధివినాయకుని అందరూ క్యూను పాటించి దర్శించుకోవాలని ఈఓ మంగేష్ షిందే కోరారు. ట్రాఫిక్ మళ్లింపు అంగారకి సంకష్టిని పురస్కరించుకుని జూలై 14 నుంచి ప్రభాదేవి సిద్ధివినాయకుని ఆలయం చుట్టుపక్కల పరిసరాలలోని రోడ్లపై ట్రాఫిక్‌లో పలు మార్పులు చేశారు. అంగారికి సంకష్టి జూలై 15 మంగళవారం అయినప్పటికీ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దర్శనం చేసు కోవాలన్న తపనతో అనేక మంది భక్తులు ఆలయం వద్దకి చేరుకుంటారు. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు, కొన్ని మార్గాల్లో రాకపోకలను నిలిపివేయనున్నారు.


