దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు

Vijayawada Kanaka Durga Darshan Times Changed Due To Coronavirus - Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కోవిడ్‌ ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. గురువారం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రాతఃకాల అర్చన, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. ఖడ్గమాలార్చన సమయంలో ఒక క్యూలైన్‌లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఈ క్యూలైన్‌ ద్వారా ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులను అత్యవసరం అయితే దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రాత్రి నిద్ర చేసే భక్తులు తెల్లవారుజామున లేచి అమ్మవారిని దర్శించుకుని తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరుతారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఉదయం 6 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి అనుమతించేవారు.

దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైళ్లు అందుకోలేక ఇబ్బందులు పడేవారు. దీనిపై వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులతో చర్చించిన ఈవో దర్శన వేళలను మార్పు చేశారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top