breaking news
Banke Bihari temple
-
దేవుడి ఖజానా ఏమైంది?
బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.ఖజానా వివాదం..అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్‌లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. విశేషం ఏంటంటే..ఈ బృందావన్‌లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్‌ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్‌లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది. బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం. భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు. సెపె్టంబర్లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు. ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది. తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్‌లో దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్‌పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది. -
Banke Bihari: ఆ గుప్త నిధులు ఎక్కడ?
బృందావనం (మథుర): యూపీలోని బృందావన్‌లో ప్రసిద్ది చెందిన బాంకే బిహారీ ఆలయ ఖజానా అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. గత 54 ఏళ్లుగా సీలు వేసిన ఆలయ తోషఖానా (ఖజానా)ను గత నెలలో సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఆదేశాల మేరకు తెరిచారు. అయితే, తరతరాలుగా రాజ బహుమతులు, బంగారు ఆభరణాలు, అపారమైన కానుకలు ఉన్నాయని నమ్మిన ఈ ఖజానాలో కేవలం ఒకే ఒక బంగారం కడ్డీ, మూడు వెండి కడ్డీలు, కొన్ని ఇత్తడి పాత్రలు మాత్రమే లభించడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకే ఒక బంగారు కడ్డీ లభ్యంఖజానాలో ఊహించిన విధంగా విలువైన బంగారు కిరీటం, రత్నాల హారం లాంటివి లేవు. ఇందుకు బదులుగా కేవలం ఒక బంగారు కడ్డీ, కుంకుమతో చారలు ఉన్న మూడు వెండి కడ్డీలు ఒక పొడవైన చెక్క పెట్టెలో లభించాయి. దీనికితోడు ఖజానాలో ఉన్న వస్తువులకు సంబంధించి దాతల రిజిస్టర్, జాబితా, లేదా విలువ కట్టే పత్రాలు కూడా మాయం కావడం గమనార్హం. దీంతో మాయమైన ఆలయ నిధి ఎక్కడ ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది. దీంతో వారు సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.10 ఖాతాల్లో రూ. 400 కోట్ల నగదు?రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అశోక్ కుమార్ అధ్యక్షతన ఏర్పడిన సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఈ ఆలయానికి చెందిన సుమారు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులపై విచారణ చేపట్టింది. ఆలయానికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, సీలు చేసిన లాకర్లు, భూమి కమతాలు, విరాళ రికార్డులపై పూర్తిస్థాయి ఆస్తి ఆడిట్‌ను ప్రారంభించింది. ఆలయానికి మధుర, బృందావన్‌లలో 10కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో సుమారు రూ. 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు నగదు ఉన్నట్లు అంచనా. వీటిని ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ప్యానెల్ ఆదేశించింది.భక్తుల కానుకలతో నిర్మాణంఆలయ సంప్రదాయ కార్యకలాపాలను నిర్వహించే వంశపారంపర్య గోస్వామి కమ్యూనిటీ సభ్యులు ఇటీవల కొన్ని ఆభరణాలను ఎస్బీఐ మథుర శాఖలో జమ చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పత్రాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ విషయంలో పూజారులపై ఎటువంటి ఆరోపణలు చేయలేమని, తమ ఆలయం దక్షిణాది దేవాలయాల మాదిరిగా రాజులచే నిర్మితం కాలేదని, భక్తుల కానుకలతో నిర్మించారని కమిటీ సభ్యుడొకరు పేర్కొన్నారు.ఏకీకృత నివేదిక కోసం ఆదేశాలుకాగా ఖజానాలో దొరికిన వస్తువులకు సీలు చేశారు. అయితే వాటికి అధికారికంగా ఇంకా విలువ కట్టలేదు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు. నవంబర్ 19 న జరగనున్న ప్యానెల్ తదుపరి సమావేశానికి ముందుగా అన్ని బ్యాంకు ఖాతాలు, విరాళాల రసీదులతో కూడిన ఏకీకృత నివేదికను సిద్ధం చేయాలని ఆలయ మేనేజర్‌ను ప్యానెల్ సభ్యులు కోరారు. కాగా 1864లో సాధువు, సంగీతకారుడు స్వామి హరిదాస్ అనుచరులు నిర్మించిన ఈ బాంకే బిహారీ ఆలయానికి రోజుకు దాదాపు 50 వేల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ సంఖ్య పండుగలు, శుభ దినాలలో లక్షలకు పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘కుంబ్’ వ్యర్థమా?.. మరి హాలోవిన్?’ -
అందుకు శ్రీకృష్ణ భగవానుడే తొలి మధ్యవర్తి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 150 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన పురాతన బాంకే బిహారీ ఆలయానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం-ఆలయ ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఉన్నత స్థాయి కమిటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బృందావన్‌లో ఉన్న బాంకే బిహారీ కృష్ణ దేవాలయం అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా రూ. 500 కోట్లను ఆలయ నిధులతో దేవాలయ అభివృద్ధి పనులను చేపట్టడానికి యూపీ ప్రభుత్వం సిద్ధం కాగా, ఆలయ ట్రస్టు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఇది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఆలయ నిధులను అభివృద్ధికి వాడటానికి మే 15వ తేదీన సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా, తాజా తీర్పులో ఆ వివాదాన్ని ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సెటిల్ చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గత తీర్పును ఉపసంహరించుకోవాలని ధర్మాసనం మౌఖికంగా ప్రతిపాదించింది ప్రస్తుత ధర్మాసనం.తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే..బాంకే బిహారీ ఆలయం-యూపీ ప్రభుత్వం వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ‘ బృందావన్‌లోని బాంకే బిహారీ టెంపుల్‌కు తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోండి. సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని ప్రతిపాదిస్తున్నాం. ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ట్రస్టు బోర్డుకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. గత సుప్రీంకోర్టు తీర్పులో కొంత భాగాన్ని నిలుపుదల చేద్దాం. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేక సీనియర్ రిటైర్డ్ జిల్లా జడ్జి ఇరు పక్షాలకు ధర్మకర్తగా ఉంటారు’ అని స్పష్టం చేసింది. ఇదీ ఆలయ చరిత్ర..1862లో నిర్మించబడిన ఈ ఆలయం రాజస్తానీ శైలిలో నిర్మించబడిందిఉత్తరప్రదేశ్లోని బాంకే బిహారీ ఆలయం బృందావన్‌లో ఉన్న శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి.ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం.ఇక్కడ శ్రీ బాంకే బిహారీగా పూజించబడే కృష్ణుడు, బాలరూపంలో దర్శనమిస్తాడు.ప్రత్యేకత: ఈ ఆలయంలో గంటలు మోగించరు, హారతులు ఇవ్వరుఇది భక్తి శ్రద్ధలకు అడ్డురాకుండా ఉండేందుకు అనాదిగా వస్తున్న ఆచారం.ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులు దేవుని పాదాలను దర్శించగలుగుతారు.వివాదం ఇలా.. ఆలయ అభివృద్ధికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఆలయ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత మే నెలలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. రూ. 500 కోట్లను కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ అభివృద్ధి కోసం వాడుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వంతో బాంకే బిహారీ టెంపుల్ ట్రస్టు మధ్య వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి కారణం రూ. 500 కోట్ల కారిడార్ ప్రాజెక్ట్. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకురాగా, ఆలయ ట్రస్ట్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత తీర్పును మౌఖికంగా నిలుపుదల చేస్తూ దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీన్ని హైకోర్టు లేదా, జిల్లా కోర్టు మాజీ జడ్జిల ద్వారా ఓ కమిటీ ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించడమే సరైన మార్గంగా పేర్కొంది. ఆలయ వారసత్వం దెబ్బతింటుందనే..యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలయ అభివృద్ధి-నిధులు ఆర్డినెన్స్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు ఆలయ ట్రస్ట్ అభ్యంతరంతో పాటు స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో మరమ్మత్తులు చేపడితే ఆలయ వారసత్వం, వాస్తవికత దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇది సున్నితమైన అంశం కావడంతో పాటు ఆధ్యాత్మిక వైభవం, సంప్రదాయాల సమతుల్యతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. -
రూ. 500 నోట్లతో డబ్బుల వాన!
ఆగ్రా(యూపీ): బృందావనంలో డబ్బుల వాన కురిసింది. పైనుంచి పడుతున్న రూ. 500 నోట్లను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. డబున్న మహరాజు ఎవరో వీటిని విసిరేశాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. పైనుంచి పైకం విసిరేసింది ఒక కోతి. దానికి అంత డబ్బు ఎక్కడి వచ్చిందా అని అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బాంకీ విహారి ఆలయంలో శనివారం ఈ ఆసక్తికర ఘటన చోటుకుంది. అసలేం జరిగిందంటే... ముంబైలోని బొరివలీ ప్రాంతానికి చెందిన హేమవతి సోంకర్(50) తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి శనివారం బృందావనంకు వచ్చారు. బాంకీ విహారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత రోడ్డు పక్కనున్న దుకాణాల్లో షాషింగ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి హఠాత్తుగా కిందికి దూకి హేమవతి చేతిలోని బ్యాగ్ లాక్కుపోయింది. దుకాణం పైకి ఎక్కి అందులోని నోట్ల కట్లను బయటకు లాగి పైనుంచి విసిరేసింది. డబ్బులు ఏరుకునేందుకు అక్కడున్నవారంతా పోటీ పడ్డారు. తమ దొరికిన నోట్లను చాలా మంది హేమవతికి తిరిగిచ్చేసి తమ నిజాయితీ చాటుకున్నారు. కొంతమంది మాత్రం చేతివాటం ప్రదర్శించారు. తన బ్యాగులో రూ. లక్షన్నర ఉందని, వీటిలో 100 నుంచి 500 నోట్లు ఉన్నాయని హేమవతి వెల్లడించారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, బృందావనంలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తరచుగా వచ్చే భక్తులతో పాటు, స్థానికులు వాపోతున్నారు.


