బృందావనం (మథుర): యూపీలోని బృందావన్‌లో ప్రసిద్ది చెందిన బాంకే బిహారీ ఆలయ ఖజానా అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. గత 54 ఏళ్లుగా సీలు వేసిన ఆలయ తోషఖానా (ఖజానా)ను గత నెలలో సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఆదేశాల మేరకు తెరిచారు. అయితే, తరతరాలుగా రాజ బహుమతులు, బంగారు ఆభరణాలు, అపారమైన కానుకలు ఉన్నాయని నమ్మిన ఈ ఖజానాలో కేవలం ఒకే ఒక బంగారం కడ్డీ, మూడు వెండి కడ్డీలు, కొన్ని ఇత్తడి పాత్రలు మాత్రమే లభించడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఒకే ఒక బంగారు కడ్డీ లభ్యం
ఖజానాలో ఊహించిన విధంగా విలువైన బంగారు కిరీటం, రత్నాల హారం లాంటివి లేవు. ఇందుకు బదులుగా కేవలం ఒక బంగారు కడ్డీ, కుంకుమతో చారలు ఉన్న మూడు వెండి కడ్డీలు ఒక పొడవైన చెక్క పెట్టెలో లభించాయి. దీనికితోడు ఖజానాలో ఉన్న వస్తువులకు సంబంధించి దాతల రిజిస్టర్, జాబితా, లేదా విలువ కట్టే పత్రాలు కూడా మాయం కావడం గమనార్హం. దీంతో మాయమైన ఆలయ నిధి ఎక్కడ ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది. దీంతో వారు సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
10 ఖాతాల్లో రూ. 400 కోట్ల నగదు?
రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అశోక్ కుమార్ అధ్యక్షతన ఏర్పడిన సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఈ ఆలయానికి చెందిన సుమారు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులపై విచారణ చేపట్టింది. ఆలయానికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, సీలు చేసిన లాకర్లు, భూమి కమతాలు, విరాళ రికార్డులపై పూర్తిస్థాయి ఆస్తి ఆడిట్‌ను ప్రారంభించింది. ఆలయానికి మధుర, బృందావన్‌లలో 10కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో సుమారు రూ. 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు నగదు ఉన్నట్లు అంచనా. వీటిని ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మార్చాలని ప్యానెల్ ఆదేశించింది.
భక్తుల కానుకలతో నిర్మాణం
ఆలయ సంప్రదాయ కార్యకలాపాలను నిర్వహించే వంశపారంపర్య గోస్వామి కమ్యూనిటీ సభ్యులు ఇటీవల కొన్ని ఆభరణాలను ఎస్‌బీఐ మథుర శాఖలో జమ చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పత్రాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ విషయంలో పూజారులపై ఎటువంటి ఆరోపణలు చేయలేమని, తమ ఆలయం దక్షిణాది దేవాలయాల మాదిరిగా రాజులచే నిర్మితం కాలేదని, భక్తుల కానుకలతో నిర్మించారని కమిటీ సభ్యుడొకరు పేర్కొన్నారు.
ఏకీకృత నివేదిక కోసం ఆదేశాలు
కాగా ఖజానాలో దొరికిన వస్తువులకు సీలు చేశారు. అయితే వాటికి అధికారికంగా ఇంకా విలువ కట్టలేదు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు కాలేదు. నవంబర్ 19 న జరగనున్న ప్యానెల్ తదుపరి సమావేశానికి ముందుగా అన్ని బ్యాంకు ఖాతాలు, విరాళాల రసీదులతో కూడిన ఏకీకృత నివేదికను సిద్ధం చేయాలని ఆలయ మేనేజర్‌ను ప్యానెల్ సభ్యులు కోరారు. కాగా 1864లో సాధువు, సంగీతకారుడు స్వామి హరిదాస్ అనుచరులు నిర్మించిన ఈ బాంకే బిహారీ ఆలయానికి రోజుకు దాదాపు 50 వేల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ సంఖ్య పండుగలు, శుభ దినాలలో లక్షలకు పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: ‘కుంబ్’ వ్యర్థమా?.. మరి హాలోవిన్?’


