
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై మోపబడిన ఆరోపణలు వాస్తవమేనని, గౌరవ ప్రదంగా తప్పుకోకపోవడంతో ఆయన్ని తొలగించాల్సిందేనని ఇన్‌హౌజ్ కమిటీ ఇంతకు ముందు నివేదిక ఇచ్చింది. అయితే ఆయన్ని అభిశంసించాలన్న వ్యవహారంపై పార్లమెంట్‌లో ఓ అడుగు ముందుకు పడింది.
ఇన్‌హౌజ్ కమిటీ నివేదిక ఇచ్చిన ప్రతిపాదనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇందులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ మణిందర్ మోహన్, సీనియర్ అడ్వొకేట్ బీవీ ఆచార్య సభ్యులుగా ఉంటారని తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై 146 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.
వాట్ నెక్ట్స్..
పార్లమెంట్‌లో ఏర్పాటైన కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు.
అయితే ప్రస్తుతం పార్లమెంట్ సెషన్ 21వ తేదీతో ముగియనుంది. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్‌లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.