
న్యూఢిల్లీ: 150 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన పురాతన బాంకే బిహారీ ఆలయానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం-ఆలయ ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఉన్నత స్థాయి కమిటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బృందావన్‌లో ఉన్న బాంకే బిహారీ కృష్ణ దేవాలయం అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రధానంగా రూ. 500 కోట్లను ఆలయ నిధులతో దేవాలయ అభివృద్ధి పనులను చేపట్టడానికి యూపీ ప్రభుత్వం సిద్ధం కాగా, ఆలయ ట్రస్టు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఇది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.
ఆలయ నిధులను అభివృద్ధికి వాడటానికి మే 15వ తేదీన సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా, తాజా తీర్పులో ఆ వివాదాన్ని ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సెటిల్ చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గత తీర్పును ఉపసంహరించుకోవాలని ధర్మాసనం మౌఖికంగా ప్రతిపాదించింది ప్రస్తుత ధర్మాసనం.
తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే..
బాంకే బిహారీ ఆలయం-యూపీ ప్రభుత్వం వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ‘ బృందావన్‌లోని బాంకే బిహారీ టెంపుల్‌కు తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోండి. సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని ప్రతిపాదిస్తున్నాం. ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ట్రస్టు బోర్డుకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. గత సుప్రీంకోర్టు తీర్పులో కొంత భాగాన్ని నిలుపుదల చేద్దాం. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేక సీనియర్ రిటైర్డ్ జిల్లా జడ్జి ఇరు పక్షాలకు ధర్మకర్తగా ఉంటారు’ అని స్పష్టం చేసింది.
ఇదీ ఆలయ చరిత్ర..
1862లో నిర్మించబడిన ఈ ఆలయం రాజస్తానీ శైలిలో నిర్మించబడింది
ఉత్తరప్రదేశ్‌లోని బాంకే బిహారీ ఆలయం బృందావన్‌లో ఉన్న శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి.
ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం.
ఇక్కడ శ్రీ బాంకే బిహారీగా పూజించబడే కృష్ణుడు, బాలరూపంలో దర్శనమిస్తాడు.
ప్రత్యేకత: ఈ ఆలయంలో గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు
ఇది భక్తి శ్రద్ధలకు అడ్డురాకుండా ఉండేందుకు అనాదిగా వస్తున్న ఆచారం.
ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులు దేవుని పాదాలను దర్శించగలుగుతారు.
వివాదం ఇలా.. ఆలయ అభివృద్ధికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఆలయ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత మే నెలలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. రూ. 500 కోట్లను కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ అభివృద్ధి కోసం వాడుకోవచ్చని స్పష్టం చేసింది.
యూపీ ప్రభుత్వంతో బాంకే బిహారీ టెంపుల్ ట్రస్టు మధ్య వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి కారణం రూ. 500 కోట్ల కారిడార్ ప్రాజెక్ట్. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకురాగా, ఆలయ ట్రస్ట్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత తీర్పును మౌఖికంగా నిలుపుదల చేస్తూ దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీన్ని హైకోర్టు లేదా, జిల్లా కోర్టు మాజీ జడ్జిల ద్వారా ఓ కమిటీ ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించడమే సరైన మార్గంగా పేర్కొంది.
ఆలయ వారసత్వం దెబ్బతింటుందనే..
యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలయ అభివృద్ధి-నిధులు ఆర్డినెన్స్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు ఆలయ ట్రస్ట్ అభ్యంతరంతో పాటు స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో మరమ్మత్తులు చేపడితే ఆలయ వారసత్వం, వాస్తవికత దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇది సున్నితమైన అంశం కావడంతో పాటు ఆధ్యాత్మిక వైభవం, సంప్రదాయాల సమతుల్యతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.