గవర్నర్‌కు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల ప ర్యటనలో భాగంగా మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి పయనమయ్యారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 70,251 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,862 మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ. 4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వా మివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
18న మెగా జాబ్‌మేళా
తిరుపతి తుడా: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధ్వర్యంలో తిరుపతిలోని కచపి ఆడిటోరియం వేదికగా ఈనెల 18వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు మెప్మా డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 18 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హా జరవుతారని, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారని తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీతో పాటు పలు పార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు.
జనవరి 10, 11తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్
తిరుపతి అర్బన్: కొత్త ఏడాది జనవరి 10, 11తేదీల్లో సూళ్లూరుపేట పరిధిలోని పులికాట్ సరస్సుతోపాటు సమీప ప్రాంతాల వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సెల్వం, ప ర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్‌తో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫ్లె మింగో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించారు. పులికాట్–నేలపట్టు, బీవీ పాళెం, అటకానితిప్ప, ఇరక్కంఐలాండ్, ఉబ్బలమడుగు, పెరియపాళెం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చే యడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం చేయాలన్నారు. వీటికి సంబంధించి పోస్టర్, లోగో, పబ్లిసిటీ, బ్యానర్లు, డిజిటల్ బోర్డు ద్వారా ప్రచారం చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి ఎం.జనార్దన్‌రెడ్డి, ఏపీ టీడీసీ ఈఈ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
గవర్నర్‌కు సాదర స్వాగతం


