పాత ఓపీ విధానంతో రోగులకు మనోవేదన
సాక్షి టాస్క్ ఫోర్స్, తిరుపతి: తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఆర్థో సంబంధిత శస్త్ర చికిత్సలు, కీళ్ల మార్పిడి వంటి వైద్యం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వస్తుంటారు. ఎప్పటికప్పుడు రోగుల అవసరాలను గుర్తిస్తూ టీటీడీ ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. గతంలో సుదీర్ఘకాలం డైరెక్టర్‌గా పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే ఈ ఏడాది మే 2న మరోసారి ప్రభుత్వ పెద్దల సూచనలతో డైరెక్టర్ బాధ్యతలను అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఆయన తనదైన శైలిలో మోనార్క్‌లా వ్యవహరిస్తూ ఆస్పత్రిని తన సొంత జాగీర్‌లా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన మార్కును చూపించేందుకు టీటీడీ బోర్డు అనుమతులు లేకుండానే సొంత నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తాను చెప్పింది, తాను అనుకున్నదే జరగాలంటూ తన వ్యక్తిగత జేబు సంస్థలా బర్డ్‌లో పాలనను సాగిస్తున్నారు. అన్నీ తెలిసినా టీటీడీ అధికారులు కానీ, బోర్డు పెద్దలు గానీ ఆయన నిర్ణయాలపై ప్రశ్నించే సాహసం చేయడం లేదు. దీంతో ఆయన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. టీటీడీ అన్ని ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం వైద్య సేవలు కొనసాగుతుంటే బర్డ్‌లో మాత్రం ఆయనకు మూడ్ వచ్చినప్పుడు మాత్రమే వైద్యం అందిస్తూ తన నిరంకుశతను ప్రదర్శించుకుంటున్నారు. దీంతో అక్కడి వైద్యులు, వైద్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మానసిక వేదనతో మదన పడుతున్నారు.
ప్రైవేట్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు?
బర్డ్ పేరు ప్రతిష్టలను ఉపయోగించుకుని డాక్టర్ జగదీష్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం చట్టవిరుద్ధం. టీటీడీలో పనిచేస్తున్న వైద్యులు ఎవరు ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదన్న కఠిన నిబంధన ఉంది. అయితే డాక్టర్ జగదీష్‌కు ఆ నిబంధనలు వర్తించవా? ఆయన మాత్రమే టీటీడీకి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో పాటు ద్వారకా తిరుమల, హైదరాబాద్ ప్రముఖ ఆస్పత్రుల్లో ఆయన అనధికార వైద్యుడిగా కొనసాగుతున్నారు. అలానే శస్త్రచికిత్స అనంతరం రోగిని ఫాలోఅప్ చేయడాన్ని పూర్తిగా విస్మరించారు. బర్డ్‌లో అక్రమాలు, అవినీతిపై ఇటీవల ఓ భక్తుడు టీటీడీ ఈఓకి పది పేజీల లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ లేఖపై విచారణ చేసేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
ఆయనకు ఇష్టమొచ్చినప్పుడే వైద్యమా?
టీటీడీ ఆస్పత్రిలో ఓపీ విధానంలో కచ్చితంగా సమయపాలన ఉంటుంది. అయితే బర్డ్ ఆస్పత్రిలో మాత్రం డాక్టర్ జగదీష్‌కు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే వైద్యం చేయిస్తూ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది పరుగులు పెడుతున్నారు. ఘాడ నిద్రలో ఉన్న రోగులకు మత్తుమందు ఇచ్చి సర్జరీలు చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు రోగి భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు తీసుకోవాలి.
గతంలో రోగులు తమకు ఇష్టమైన వైద్యుడు, అణువైన సమయంలో ఓపీ నమోదు చేసుకునేందుకు పటిష్టమైన వ్యవస్థను తీసుకువచ్చారు. ఓపీ కోసం ఆన్‌లైన్ విధానంతో పాటు టెలిఫోన్, క్యూఆర్ కోడ్‌ను సైతం అందుబాటులోకి వచ్చింది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితులకు చెక్ పెట్టారు. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రోగులు సులువుగా ఓపీని పొంది సమయానికి వైద్యం చేయించుకుని తిరిగి వెళ్లేవారు. డాక్టర్ జగదీష్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే ఓపీ విధానంలో పాత పద్ధతులను అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో ఆన్‌లైన్ విధానానికి స్వస్తి పలకడంతో రోగులు అర్ధరాత్రి నుంచి క్యూలో నిలబడక తప్పడం లేదు. గంటల తరబడి ముందు రోజు రాత్రి నుంచే ఆస్పత్రిలో పడిగాపులు కాస్తున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మ్యానువల్ ఓపీ విధానం శాపంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు వ్యయ ప్రయాసలకు గురవుతున్నా రు. వాహన అద్దె ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఓపీ తీసుకున్న తర్వాత వైద్యం చేయించుకుని తిరిగి వెళ్లేందుకు 12 గంటల నుంచి 18 గంటల సమయం పడుతోంది. వాహన అద్దె ఖర్చులతో పాటు భోజన ఖర్చులు తడిసి మోపిడువుతున్నాయి. టీటీడీ బోర్డు అనుమతులు లేకుండానే ఆయన ఓపీ విధానంలో మార్పులు చేసినా అడిగే వారు కరువయ్యారు. దీంతో బర్డ్‌లో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు అమలవుతున్నాయి.
పాత ఓపీ విధానంతో రోగులకు మనోవేదన
పాత ఓపీ విధానంతో రోగులకు మనోవేదన
పాత ఓపీ విధానంతో రోగులకు మనోవేదన
పాత ఓపీ విధానంతో రోగులకు మనోవేదన


