వంద శాతం పల్స్‌పోలియా
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు పల్స్ పోలియా 100 శాతం చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం అధికారులతో సమీక్షించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియో కార్యక్రమం వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని హైరిస్క్ జనాభాను గుర్తించి, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 26 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1868 పోలియో బూత్‌లు, 84 మొబైల్ బూత్‌లు, 59 ట్రాన్సిట్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, డీఎల్‌ఏసీటీఓ డాక్టర్ శైలజ, ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి పాల్గొన్నారు.


