కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్
తిరుపతి మంగళం : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతంగా జరిగిందని మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం అయ్యాయన్నారు. ప్రభుత్వ సూపర్ సిక్స్ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే 1.30 కోట్ల మంది సంతకాలు చేయడం సామాన్యమైన విషయం కాదని, దీన్ని చూస్తే ఈ ప్రభుత్వంపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థమవుతుందని తెలిపారు. ఈ సంతకాల కార్యక్రమంలో వైఎస్సార్ సీపీతోపాటు బీజేపీ, జనసేన, టీడీపీకి చెందినవారు కూడా సంతకాలు చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించడంతోపాటు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలని, పేద బిడ్డల మెడికల్ చదువులపై ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు.


