డాక్టర్ మొకురాల స్వర్ణలత
సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమ రెడ్డి మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన చాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువ కప్పటం, బొకే అందించటం.. అన్నింటికంటే ముఖ్యంగా ఫొటోలు దిగటం చేస్తున్నారు. ఉదయం 9.45కి మొదలైన ఈ ఫొటో సెషన్ లంచ్ టైమ్ దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందర్నీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి చాంబర్ తలుపులేశాడు.
‘అయ్యా! ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీ కోసం వచ్చిన వాళ్లు ఎంత సేపైనా ఆగుతారులెండి. మీకు వాళ్లతో పనిలేకున్నా, వాళ్లకు మీతో పని కదండి– ఆగుతారు. ఎవరికోసం ఆగుతారు’ అంటూ మంత్రిగారితో చెబుతూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చి పెట్టటం, ప్లేట్‌లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించటమూ చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి, ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు! అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయటం మొదలెట్టారు.
సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్లా మంత్రిగారితో ములాఖత్‌లు మొదలయ్యాయి. మళ్లీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితోపాటే లైన్ లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్‌కు ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కాని, ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్‌కు సంబంధం లేకుండా. ‘బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్‌గా కలుసుకోవాలనుకుంటున్నాడేమో’ అని యాదగిరి ఆలోచిస్తూనే అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది.
ఇక అంతా అయిపోయారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు మంత్రిగారి చాంబర్ కేసి. చేతిలో ఓ పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశాడు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, ‘ఇతనొక్కరే సర్. ఇక అయిపోయారు. మీరిక రిలాక్స్ అవ్వొచ్చు‘ అన్నాడు.
చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదిగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫొటోకు ఫోజివ్వటానికి సిద్ధపడుతుంగా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘అబ్బే! ఫొటోలాంటివి వద్దండి. నేను మీకు అభిమానినండి. కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చానండి’ అని అన్నాడు. మంత్రిగారి భృకుటి ముడిపడింది.
అదేమిటీ అభిమానినంటాడు, ఫొటో వద్దంటాడు– సరే ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని ‘చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు?’ అన్నాడు సీమ రెడ్డి. ‘నా పేరు భాస్కర్రావండి. మాది అమలాపురమండి. మీరంటే మొదట్నుంచి అభిమానమండి. మీరు మంత్రిగా అయ్యారు కదండి. చాలా సంతోషమేసిందండి.. ఆయ్.. అందుకే ఓపాలి మిమ్మల్ని కలిసిపోదామనొచ్చానండి‘ అన్నాడు. సీమ రెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, ‘సరేనండి.. నాకు చాలా కార్యక్రమాలున్నాయి. మరెప్పుడైనా కలుసుకుందాం, సెలవు’ అని ఓ దండం పెట్టాడు.
‘చాలా సంతోషమండి.. ఉంటానండి. ఆయ్’ అని భాస్కర్రావు బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనను కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు. బిజినెస్‌మన్ ఉన్నారు, తనతో పనులు చేయించుకోవటానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కాని, చివర్లో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు.
మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్‌లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టటాలు సర్వ సాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ల పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివర్లో వచ్చిన భాస్కర్రావు కూడా తన చాంబర్‌కు వస్తూ పోతున్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి పోతున్నాడు తప్పితే, పల్లెత్తి ఒక్క పని కూడా అడగటం లేదు.
‘ఎందుకయ్యా ఇవన్నీ’ అంటే, ‘ఏదో నా అభిమానమండి’ అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు.
ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్రావు వైఖరి అసలు అంతుపట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నేసి సార్లు మంత్రిగారిని ఎందుకు కలుస్తున్నాడు. నోరు తెరిచి అడిగినా ‘అబ్బే! ఏం లేదండి’ అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది.
ఈ మధ్య కాలంలో ఓ వందసార్లు అయినా భాస్కర్రావు మంత్రిగారిని కలవటానికి వచ్చి ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ‘ఇది మా పొలంలో పండింది’ అంటాడు. ‘ఇది మా ఏరియాలో ఫేమస్సు’ అంటాడు. ‘ఎందుకయ్యా’ అంటే, ‘అభిమానమండి’ అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా పోయిందంటే, మంత్రిగారిని డిఫెన్ ్సలో పడేసే వరకూ వెళ్లింది వ్యవహారం. అరె ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి.
ఎప్పటిలాగే ఓ రోజు సీమరెడ్డి చాంబర్‌కు వచ్చాడు భాస్కర్రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమ రెడ్డి ఒక్కడే చాంబర్‌లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డ్స్‌కు బాగా పరిచయమున్న ఫేస్ కావటంతో భాస్కర్రావును ఎవరూ అడ్డుకోలేదు. పైగా ‘వెళ్ళండి వెళ్లండి మంత్రిగారు ఒక్కరే ఉన్నారు’ అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్రావు మీద వారికి ఎందుకంత అభిమానమంటే వస్తూ పోతూ వీళ్లకు కావాల్సినవేవో భాస్కర్రావు మొహమాట పెట్టి మరీ ఇచ్చి పోతుంటాడు మరి.
ఎప్పటి లాగే మంత్రిగారి గదిలోకి అడుగు పెట్టాడు భాస్కర్రావు. ‘రండి.. రండి భాస్కర్. ఏమిటీ ఇవాళేం తెచ్చావు నాకోసం’ అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజీ వైపు చూశాడు.
‘మీకు తెలీందేముందండి... మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నిన్న ఏదో ఫంక్షన్ ఉండి వెళ్లాను. ఎలాగూ అంతదూరం వెళ్లాను కదా.. తమరి కోసం మంచినెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రైఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నా కదాని పట్టుకొచ్చానండి’ అన్నాడు భాస్కర్రావు.
అతని బ్యాగ్‌లోంచి బాక్స్‌లు బయటకు తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపన్ చేసి ఒకటి నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు.
తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్రావు కుశాగ్రబుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన ఆ పూతరేకులపై, అవి తెచ్చిన భాస్కర్రావుపై అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి.
కాసేపటికి కాన్షియస్‌లోకి వచ్చిన సీమ రెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని ‘కూచోబ్బా! భాస్కర్రావూ’ అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్రావు.
‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి.
మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్రావు.
‘ఆయ్! ఎంత మాటండి.. మీరు అడగటమూ, నేనూ ఒప్పుకోకపోవటమా! అన్నన్నా! అదెలాగ కుదురుతుందండి‘ అన్నాడు.
‘మరేం లేదబ్బా! ఎప్పటి నుంచో నా కాడకు వస్తుండావు. ఎప్పడడిగినా ఏమీ లేదంటావు.. ఒప్పుకుంటాలే గానీ. నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా! ఏ పని అయినా సరే కోరుకో.. నీ కోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా!’ అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి.
నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావటం ఆశ్చర్యమే! తప్పలేదు. ఎందుకంటే ఈ భాస్కర్రావు గత కొన్నాళ్లుగా తనను మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రిగారిని ఇన్నేసిసార్లు కలుసుకోవడమేంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతా ఉంటాడు.
ఇవ్వటానికి ఆయనకు మనసున్నా, ఉట్టినే తీసుకోవటానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడ్ని. ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలివి. దీనికి ముగింపు పలకటానికే ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడూ లేని బేలతనం ఉట్టిపడింది.
సరే.. ఇక చెప్పే టైమ్ వచ్చేసిందని గుర్తించిన భాస్కర్రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు.. ‘మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండీ. ఆయ్.. మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానమండి. మరేం లేదండి.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకొక పని చేసిపెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు, డిపో కూడా పెడతామని నిర్ణయించింది కదండి.
అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరిమీది మమకారంతో చెబుతున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండ్, డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నాకోసం... కాదు కాదు... మా ఊరి కోసం చేయండి’ అన్నాడు భాస్కర్రావు.
భాస్కర్రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను విన్నది నిజమేనా అని ఓసారి గిల్లి కూడా చూసుకున్నాడు. చురుక్కుమనటంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి భాస్కర్రావు పిచ్చిపిచ్చిగా నచ్చాడు.
‘సరే! అబ్బా.. నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండ్, డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా, కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి.. అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టాలబ్బా!’ అన్నాడు సీమరెడ్డి.
‘ఆయ్! అదెంత పనండి... నేనుండేది అందుకే గాదండీ... మీరు చెప్పారు కదాండి... అది చాలండి. ఫలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి. కాస్త దూరమైనా ఓసారి బస్టాండ్, డిపో వస్తే అదే డెవలప్ అయిపోతుందండి’... అని మంత్రిగారిని ఊరి బయట బస్టాండ్, డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్రావు.
తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, డిపో రెండింటికి ప్రారంభోత్సవం, మంత్రి సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది.
రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్, డిపో కూడా రావటంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్లందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడిన వాడు భాస్కర్రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్, డిపో ఊరికి చాలా దూరంలో ఉండి, ఏ డిమాండ్ లేక పడి ఉన్న భాస్కర్రావు పొలాల పక్కనే ఉండటం. ఇన్నాళ్లు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావటంతో భాస్కర్రావు ఒక్కసారిగా ఆ ఊరిలో బిగ్ షాట్ అయిపోయాడు.
నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్రావు క్రేజ్ పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు.
ఇదంతా సాధించటానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్లి మంత్రిగారిని కలిసి రావటానికి పెట్టిన ఖర్చు, పెట్టిపోతలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కేస్తే 50 వేలు కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చక్కబెట్టుకురావడంతో 50 వేల పెట్టుబడికి కోట్లు రాబట్టాడు, వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలని. బహుశా భాస్కర్రావులాంటి వారిని చూసే ఈ సామెత కనిపెట్టారనిపిస్తుంది.
‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్రావు.
నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్రావు క్రేజ్ పెంచింది.


