సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
మా రాయితీలు ఇవ్వడానికి డబ్బుండదా!
సబ్సిడీ బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం
నిబంధనలకు విరుద్ధంగా రాయితీలు విడుదల చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం దిగిరాకపోతే విశాఖ సమ్మిట్‌ను అడ్డుకుంటాం
సచివాలయం వద్ద ధర్నాలో నినదించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: మాకు ఇవ్వాల్సిన రూ.1,200 కోట్ల పారిశ్రామిక బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవుగానీ.. విదేశీ కార్పొరేట్ సంస్థలకు రూ.వేలకోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎలా ఇస్తారంటూ దళిత పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న 100 శాతం పారిశ్రామిక ప్రోత్సాహకాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయితీ పూర్తిగా విడుదల చేయాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచి్చన దళిత పారిశ్రామికవేత్తలు సోమవారం సచివాలయం వద్ద ధర్నా చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే వీరు నల్ల కండువాలు కప్పుకొని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాజకీయరంగు పులిమి రాయితీలను నిలిపేయడాన్ని వారు నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నాయకుడు ఈడ్పుగంటి అన్నార్‌బాబు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా బకాయిల్లో 20%, 30% శాతం చొప్పున అందులోను కొందరికి మాత్రమే విడుదల చేయడం దారుణమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ 100 శాతం రాయితీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో కాకుండా కేవలం వారికి కావాల్సిన వారికి మాత్రమే నిధులు విడుదల చేశారని చెప్పారు.
ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, శుక్ర, శనివారాల్లో విశాఖపట్నంలో జరగనున్న సదస్సును కూడా అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఏడాదిన్నరగా పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూసి అప్పులపాలయ్యామని, ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పులు నిజమే..
ఈ ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతలు కొందరిని అధికారులు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వద్దకు తీసుకెళ్లి చర్చలపేరుతో గతంలో మాదిరిగానే కాలయాపన చేశారు. రాయితీల విడుదలకు సంబంధించి ఏపీఐఐసీ రూపొందించిన జాబితాలో తప్పులు దొర్లాయని యువరాజ్ పేర్కొన్నట్లు జేఏసీ నాయకుడు పినమాల నాగకుమార్ చెప్పారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించకపోతే ఏపీఐఐసీ వద్ద ధర్నా చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో జేఏసీ నాయకులు ఈరా రాజశేఖర్, జంగా త్రిమూర్తులు, చినమౌలాలి, కనపర్తి విజయరాజు, కొడాలి రాంబాబు, అన్ని జిల్లాల నుంచి అధికసంఖ్యలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


