నీటి సరఫరాలో అంతరాయంపై నిండా నిర్లక్ష్యం
జలమండలి తీరుపై వినియోగదారుల ఆగ్రహం
సమాచారం సేవలు ‘ఐటీ’కి వర్తించదా అని ప్రశ్న
బంజారాహిల్స్‌లోని ఒక కాలనీకి రోజు విడిచి రోజు తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో నల్లా నీటిని విడుదల చేస్తారు. ఎప్పటి మాదిరిగా ఒక కుటుంబం తెల్లవారు జామున లేచి నల్లా నీటి కోసం వేచి చూసింది. పదిగంటల తర్వాత సంబంధిత స్థానిక అధికారులకు ఫోన్ చేసి అడిగితే పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటిని విడుదల చేయలేదని సమాధానం చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్చవచ్చని కదా.. అడిగితే పత్రికలు చూడలేదా ? అని ఎదురు ప్రశి్నంచారు. ప్రతి నెల నల్లా బిల్లుకు సంబంధించి వివరాలు రిజిస్ట్రర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సమాచారం ద్వారా అందిస్తారు కదా..నీటి సరఫరా అంతరాయం సమాచారం కూడా పంపవచ్చు కదా అని ప్రశ్నిస్తే..సమాధానం లేదు. ఇది ఈ ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు.. ప్రతి నెల ఏదో ఒక లైన్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంటుంది. వినియోగదారులు మాత్రం ఎలాంటి సమాచారం ఉండదు. ఐటీ సేవలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా..కనీసం నల్లా నీరు రావడం లేదనే మెసేజ్ పంపడం సాధ్యం కాదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మరింత మెరుగైన సేవలందించేందుకు ఏడాది కాలంగా సరికొత్త సంస్కరణలతో ఆత్య«ధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని అందిపుచుకొని ఐటీ బాట పట్టిన జలమండలి.. వినియోగదారులకు నీటి సరఫరా అంతరాయం ‘సమాచారం’ అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. క్షేత్రస్థాయి యంత్రాంగం పనితీరును జీఐఎస్ నెట్‌వర్క్ డేటా బేస్ మ్యాపింగ్‌తో ప్రత్యేక ఆన్‌లైన్ లైవ్ లొకేషన్ డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్న జలమండలి..వినియోగదారులకు నీటి సరఫరా అంతరాయం సమాచారానికి మాత్రం ఐటీని వినియోగించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
14.21 లక్షల కనెక్షన్ల పైనే..
జలమండలి పరిధిలో సుమారు 14.21 లక్షలపైనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఉండగా, అందులో 96 శాతంపైగా గృహోపయోగ నీటి కనెక్షన్లు ఉంటాయి. ప్రధాన జలాశయాల నుంచి నీటిని తరలించి శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నగరంలో నీటి సరఫరా నెట్‌వర్క్ పైప్‌లైన్ వ్యవస్థ సుమారు 12,978.75 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలోని మెయిన్ పైపులైన్లు తరచూ పగలడం, లీకేజీలకు గురికావడంతో మరమ్మతు తప్పడం లేదు. దీంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. అయితే జలమండలి అధికారులు నీటిసరఫరా అంతరాయం సమాచారం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పత్రికల ద్వారా సమాచారం కొద్దిమేర మాత్రమే తెలుస్తుంది. దాదాపు 90 శాతం మందికి ఈ సమాచారం తెలియక నీటి కోసం తిప్పలు పడుతున్నారు. కాబట్టి వినియోగదారులకు బిల్లింగ్ వివరాలు పంపించే మొబైల్ నెంబర్‌కు అంతరాయం సమాచారం కూడా పంపిస్తే బాగుంటుందని వినియోగదారులు అంటున్నారు.
ఈ నెలలో అంతరాయం ఇలా..
తాజాగా మంజీరా నీటి సరఫరా పథకం–3 కు సంబంధించి జాతీయ రహదారి 65 సమీపంలోని 1600 ఎంఎం డయా పంపింగ్ మెయి¯న్‌లో భారీ లీకేజీ ఏర్పడటంతో జలమండలి అత్యవసరంగా షట్‌డౌన్ తీసుకుంది. దీంతో సుమారు 20 ఎంజీడీల నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు ఆయా రిజర్వాయర్‌ల పరిధిలోని ప్రాంతాల వినియోగదారులకు సమాచారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ప్యారడైజ్ జంక్షన్ నుండి డెయిరీ ఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్ష¯న్ వద్ద గల తాగునీటి సరఫరాకు సంబంధించిన 800 ఎంఎం డయా పైప్‌లైన్ విస్తరణ కోసం పనులు చేస్తుండడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీంతో తాజాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 18 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.


