breaking news
September quarter financials
-
కోటక్ లాభంలో 11% క్షీణత
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,468 కోట్లు ప్రకటించింది. గతేడాది ఇదే క్యూ2లో ఆర్జించిన రూ.5044 కోట్ల పోలిస్తే ఇది 11% తక్కువ. ప్రధాన ఆదాయ వృద్ధి నెమ్మదించడం, కొన్ని అనుబంధ కంపెనీల బలహీన పనితీరు ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం సైతం రూ.26,880 కోట్ల నుంచి రూ.24,901 కోట్లకు తగ్గింది. రుణ వృద్ధి 16% నమోదు కారణంగా నికర వడ్డీ ఆదాయం 4% పెరిగి రూ.7,311 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్ 4.91% నుంచి 4.54 శాతానికి దిగివచ్చింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే.., తాజా స్లిసేజ్లు రూ.1,875 కోట్ల నుంచి రూ.1,629 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.48% నుంచి 1.39 శాతానికి మెరుగయ్యాయి. నికర ఎన్‌పీలు(మొండి బకాయిలు) 0.43% నుంచి 0.32 శాతానికి చేరుకున్నాయి. మొత్తం ప్రొవిజన్లు రూ.660 కోట్ల నుంచి రూ.947 కోట్లకు ఎగసి నికరలాభం క్షీణతకు ప్రధాన కారణమయ్యాయి. ఈ సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు క్యాపిటల్ అడెక్వసీ 22 శాతంగా ఉంది. అనుబంధ సంస్థల బలహీన పనితీరు: బ్యాంకింగేతర సంస్థ కోటక్ మహీంద్రా ప్రైమ్ లాభం 8% తగ్గి రూ.246 కోట్లుగా నమోదైంది. కోటక్ సెక్యూరిటీస్ సంస్థ లాభం 22% తగ్గి రూ.345 కోట్లుగా ఉంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ లాభం మూడొంతులు తగ్గి రూ.60 కోట్లు, కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నికరలాభం ఏకంగా 86% క్షీణించి రూ.49 కోట్లు ఆర్జించాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో మరిన్ని కీలకాంశాలు: → నిర్వహణ వయ్యాలు 1% పెరిగి రూ.4,605 కోట్ల నుంచి రూ.4,632 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 3% పెరిగి రూ.5,099 కోట్ల నుంచి రూ.5,268 కోట్లకు పెరిగాయి. → బ్యాంకు నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.7,60,598 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.6,80,838 కోట్లతో పోలిస్తే 12% అధికంగా ఉంది. దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏయూఎం విలువ 14% పెరిగి రూ.3,62,694 కోట్లకు చేరింది. → బ్యాంకు మొత్తం డిపాజిట్లు 14.5% పెరిగి రూ.5.28 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తక్కువ వ్యయ, ఆధారిత కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) నిష్పత్తి 42.3 శాతంగా ఉంది. → కాగా, స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 3 % క్షీణించి రూ.3,282 కోట్ల నుంచి రూ.3,253 కోట్లకు తగ్గింది. బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పనిచేస్తున్న సీఎస్ రాజన్ 2026 జనవరి నుంచి 2027 అక్టోబర్ 21 వరకు తాత్కాలిక చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తారని బ్యాంకు తెలిపింది. ‘‘రెపో రేటు తగ్గింపు రెండో త్రైమాసికం నుంచి పరిగణలోకి వచ్చినందున.., క్యూ3, క్యూ4లో మార్జిన్లు క్రమంగా మెరుగుపడతాయి. ఐడీబీఐ బ్యాంకు కొనుగోలు అంశంపై స్పందించడం సరికాదు. కోటక్ బ్యాంక్ తనకు వచ్చే ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తుంది. జరుగుతున్న, జరగబోయే ఒప్పందాలపై మాట్లాడం తొందరపాటు చర్య అవుతుంది’’ అని కోటక్ సీఈవో అశోక్ వాస్వానీ అన్నారు. -
యూనియన్ బ్యాంక్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు రెట్టింపై రూ.3,511 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,848 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం రూ.22,958 కోట్ల నుంచి రూ.28,282 కోట్లకు దూసుకుపోయింది. నిర్వహణ లాభం సైతం రూ.6,577 కోట్ల నుంచి రూ.7,221 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.19,682 కోట్ల నుంచి రూ.24,587 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.9,126 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.15 శాతం నుంచి 3.18 శాతానికి పెరిగింది. బ్యాంకు ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 6.38 శాతానికి క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 8.45 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 1.30 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 2.64 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 16.69 శాతానికి మెరుగుపడింది. కాసా రేషియో (కరెంట్, సేవింగ్స్ ఖాతాలు) 35.64 శాతం నుంచి 34.66 శాతానికి తగ్గింది. సెపె్టంబర్ క్వార్టర్లో అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించినట్టు బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా 83.49 శాతం నుంచి 76.99 శాతానికి తగ్గింది. -
రూ. 88 కోట్లకు పెరిగిన ఐనాక్స్ లీజర్ నష్టం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మల్టిప్లెక్స్ స్క్రీన్ల ఆపరేటింగ్ సంస్థ ఐనాక్స్ లీజర్ నికర నష్టం మరింత పెరిగి, రూ. 88 కోట్లకు చేరింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కట్టడిపరమైన ఆంక్షల కారణంగా సినిమా ప్రదర్శన వ్యాపారం దెబ్బతినడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నష్టం రూ. 68 కోట్లు. సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 95 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు పెరిగాయి. ఐనాక్స్ లీజర్‌కు దేశవ్యాప్తంగా 70 నగరాల్లో 156 మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్లు నిర్వహిస్తోంది. 2021 జూలై నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చే కొద్దీ క్రమంగా మల్టిప్లెక్స్‌లను తెరుస్తున్నట్లు తెలిపింది. క్యూ2లో కొత్తగా ఆరు స్క్రీన్లతో రెండు ప్రాపర్టీలు జతయినట్లు ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. అనిశ్చితితో కూడుకున్న పలు త్రైమాసికాల తర్వాత ఈ క్వార్టర్లో తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. సుమారు 10 శాతం ఆక్యుపెన్సీ రేటు, సగటు టికెట్ ధర రూ. 178, ఒక్కో వ్యక్తి చేసే వ్యయం (ఎస్‌పీహెచ్) రూ. 92గా నమోదైందని, ఇది కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపు సమానమని జైన్ చెప్పారు. -
కాగ్నిజంట్ నికర లాభం 15 శాతం వృద్ధి
ముంబై: సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ సంస్థ కాగ్నిజంట్ టెక్నాలజీ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 27.69 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం, ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 31.96 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ మంగళవారం తెలిపింది. ఆదాయం 22 శాతం వృద్ధితో 231 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధి సాధించామని వివరించింది. అవుట్ సోర్సింగ్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులపై కంపెనీలు వ్యయాలను పెంచడం వంటి కారణాల వల్ల తమ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని కాగ్నిజంట్ ప్రెసిడెంట్ గోర్డన్ కోబర్న్ చెప్పారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 75 శాతం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు. ఆర్థిక ఫలితాలు బావుండటంతో ఈ ఏడాది గెడైన్స్‌ను కంపెనీ పెంచింది. 2012 ఆదాయంతో పోల్చితే 2013 ఆదాయం కనీసం 20 శాతం వృద్ధితో 884 కోట్ల డాలర్లకు పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.


