నెమ్మదించిన ప్రధాన ఆదాయ వృద్ధి
అనుబంధ కంపెనీల బలహీన పనితీరు ప్రభావం
క్యూ2లో రూ.4,468 కోట్లు
మొత్తం ఆదాయంలోనూ తగ్గుదల
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,468 కోట్లు ప్రకటించింది. గతేడాది ఇదే క్యూ2లో ఆర్జించిన రూ.5044 కోట్ల పోలిస్తే ఇది 11% తక్కువ. ప్రధాన ఆదాయ వృద్ధి నెమ్మదించడం, కొన్ని అనుబంధ కంపెనీల బలహీన పనితీరు ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం సైతం రూ.26,880 కోట్ల నుంచి రూ.24,901 కోట్లకు తగ్గింది. రుణ వృద్ధి 16% నమోదు కారణంగా నికర వడ్డీ ఆదాయం 4% పెరిగి రూ.7,311 కోట్లకు చేరింది.
అయితే నికర వడ్డీ మార్జిన్ 4.91% నుంచి 4.54 శాతానికి దిగివచ్చింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే.., తాజా స్లిసేజ్‌లు రూ.1,875 కోట్ల నుంచి రూ.1,629 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.48% నుంచి 1.39 శాతానికి మెరుగయ్యాయి. నికర ఎన్‌పీలు(మొండి బకాయిలు) 0.43% నుంచి 0.32 శాతానికి చేరుకున్నాయి. మొత్తం ప్రొవిజన్లు రూ.660 కోట్ల నుంచి రూ.947 కోట్లకు ఎగసి నికరలాభం క్షీణతకు ప్రధాన కారణమయ్యాయి. ఈ సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు క్యాపిటల్ అడెక్వసీ 22 శాతంగా ఉంది.
అనుబంధ సంస్థల బలహీన పనితీరు: బ్యాంకింగేతర సంస్థ కోటక్ మహీంద్రా ప్రైమ్ లాభం 8% తగ్గి రూ.246 కోట్లుగా నమోదైంది. కోటక్ సెక్యూరిటీస్ సంస్థ లాభం 22% తగ్గి రూ.345 కోట్లుగా ఉంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ లాభం మూడొంతులు తగ్గి రూ.60 కోట్లు, కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నికరలాభం ఏకంగా 86% క్షీణించి రూ.49 కోట్లు ఆర్జించాయి.
సమీక్షిస్తున్న త్రైమాసికంలో మరిన్ని కీలకాంశాలు:
→ నిర్వహణ వయ్యాలు 1% పెరిగి రూ.4,605 కోట్ల నుంచి రూ.4,632 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 3% పెరిగి రూ.5,099 కోట్ల నుంచి రూ.5,268 కోట్లకు పెరిగాయి.
→ బ్యాంకు నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.7,60,598 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.6,80,838 కోట్లతో పోలిస్తే 12% అధికంగా ఉంది. దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏయూఎం విలువ 14% పెరిగి రూ.3,62,694 కోట్లకు చేరింది.
→ బ్యాంకు మొత్తం డిపాజిట్లు 14.5% పెరిగి రూ.5.28 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తక్కువ వ్యయ, ఆధారిత కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) నిష్పత్తి 42.3 శాతంగా ఉంది.
→ కాగా, స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 3 % క్షీణించి రూ.3,282 కోట్ల నుంచి రూ.3,253 కోట్లకు తగ్గింది. బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పనిచేస్తున్న సీఎస్ రాజన్ 2026 జనవరి నుంచి 2027 అక్టోబర్ 21 వరకు తాత్కాలిక చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తారని బ్యాంకు తెలిపింది.
‘‘రెపో రేటు తగ్గింపు రెండో త్రైమాసికం నుంచి పరిగణలోకి వచ్చినందున.., క్యూ3, క్యూ4లో మార్జిన్లు క్రమంగా మెరుగుపడతాయి. ఐడీబీఐ బ్యాంకు కొనుగోలు అంశంపై స్పందించడం సరికాదు. కోటక్ బ్యాంక్ తనకు వచ్చే ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తుంది. జరుగుతున్న, జరగబోయే ఒప్పందాలపై మాట్లాడం తొందరపాటు చర్య అవుతుంది’’ అని కోటక్ సీఈవో అశోక్ వాస్వానీ అన్నారు.


