హౌసింగ్ బోర్డు లీజు భూములు, ఖాళీ స్థలాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు
వాణిజ్య స్థాయిలో అభివృద్ధికి నోచుకోని, లీజు ఆదాయం అందించని స్థలాలపై దృష్టి
కొన్నేళ్లుగా దుకాణాలను ఆక్రమించుకున్న వ్యాపారులు..
లీజు చెల్లించకుండా, ఖాళీ చేయకుండా వ్యవహరిస్తున్న వైనం
ఆయా స్థలాల్ని అనుభవదారులకే మార్కెట్ ధరకు విక్రయం లేదా బహిరంగ వేలం
ప్రభుత్వానికి గృహనిర్మాణ శాఖ నివేదన.. త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన
హౌసింగ్ బోర్డు లీజు స్థలాలు, షాపుల క్రమబద్ధీకరణ
ఇళ్ల పక్కనున్న 100 గజాల్లోపు స్థలాల విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్
అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావద్దు: మంత్రి పొంగులేటి
శాసనసభకు కూతవేటు దూరంలోని హౌసింగ్ బోర్డు స్థలంలో వెలిసిన పెట్రోల్ బంకు.. దాని లీజు గడువు ముగిసి 20 ఏళ్లు అవుతోంది. కానీ ఖాళీ చేయట్లేదు. పోనీ లీజు అద్దె చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. నామమాత్రపు చిల్లర డబ్బులు అడపాదడపా చెల్లిస్తూ దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా అనుభవిస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడుతున్నారు.
విజయనగర్ కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్ అది. ఓ రాజకీయ నాయకుడి గుప్పిట్లో చిక్కుకుంది. దశాబ్దాల క్రితం హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని దర్జాగా ఆ నేత వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ లీజు అద్దె మాత్రం చెల్లించట్లేదు. ఖాళీ చేయాలని కోరితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత విలువైన ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డు భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకొనే వీల్లేక.. లీజు రూపంలో ఆదాయం పొందలేక తెలంగాణ గృహనిర్మాణ మండలి కునారిల్లుపోతోంది.
ఈ తరుణంలో అలాంటి భూములను ప్రస్తుతం వాటిని అనుభవిస్తున్న వారికి మార్కెట్ ధరకు అమ్మాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. బహిరంగ వేలం ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని ఇంకా ఎక్కువకు విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
త్వరలో కేబినెట్ ముందు ఈ మేరకు ప్రతిపాదించి అందుకు ఆమోదం పొందేందుకు గృహనిర్మాణ శాఖ చర్యలు ప్రారంభించింది.
రూ. 8 వేల కోట్ల వరకు ఆదాయం...
హైదరాబాద్‌లోని కోకాపేట పరిసరాల్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇటీవల పలుమార్లు వేలం వేయగా రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోవడం తెలిసిందే. అలాగే మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని భూములు, అసంపూర్తి బహుళ అంతస్తుల భవన సముదాయాలను కూడా విక్రయిస్తోంది.
ఇదే తరహాలో తెలంగాణ గృహనిర్మాణ మండలి భూములను కూడా విక్రయించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు మండలి అధికారులు ప్రభుత్వానికి వివరాలు సమరి్పంచారు. ఏయే భూముల్ని విక్రయించే అవకాశం ఉందో లెక్కలు తేల్చారు.
వివిధ పద్ధతుల్లో లీజుల్లో ఉన్న ఈ భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ. 8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది.
లీజు భూములతోనే చిక్కు...
గృహ నిర్మాణ మండలి వాణిజ్య అవసరాలకు భూములను లీజుకు ఇచ్చింది. కొన్నింటిని ప్రార్థనా స్థలాలకు, కబరిస్తాన్‌లకు ఇవ్వగా మరికొన్నింటిని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు అప్పగించింది. వాటి నుంచి నెలవారీగా రూ. 40 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా నామమాత్రంగా చిల్లర పైసలు మాత్రమే వసూలవుతున్నాయి.
లీజు ధరలను గతంలో సవరించినా ఆ మొత్తాన్ని చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. లీజు గడువు పూర్తయిన వారు వాటిని ఖాళీ చేయట్లేదు. గతంలో చదరపు అడుగుకు రూ. 7 నామమాత్రపు లీజు ధర ఉండగా దాన్ని ఓసారి సవరించి రూ. 30కి పెంచారు.
కానీ అందులో మూడో వంతు కూడా చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. రూ. 10 చొప్పున అడపాదడపా చెల్లించి ఆయా స్థలాలను ఖాళీ చేయకుండా అ«దీనంలో ఉంచుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి 115 ఆస్తులు ఉండగా వాటి మొత్తం విస్తీర్ణం దాదాపు 256 ఎకరాలుగా ఉంది.
వాటిల్లో ధార్మిక, కబరిస్తాన్ స్థలాలు పోను మిగతా వాటిని లీజుదారులకు విక్రయించడం లేదా బహిరం™గ వేలం ద్వారా విక్రయించడం తక్షణ అవసరమని గృహనిర్మాణ శాఖ తాజాగా నిర్ణయించింది. ఇలా విక్రయించడం ద్వారా సబ్ రిజిస్ట్రార్ ధర ప్రకారమైతే రూ. 2,450 కోట్లు, మార్కెట్ ధర ప్రకారమైతే రూ. 7,400 కోట్లు పొందొచ్చని అంచనాకొచ్చింది. వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పక్కన మిగిలి ఉన్న చిన్నచిన్న స్థలాల విక్రయం ద్వారా మరో రూ. 600 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది. 
దుకాణాల విక్రయం...
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో సొంత జాగాలో గృహనిర్మాణ మండలి కాంప్లెక్సులు నిర్మించింది. నాంపల్లి, బాగ్‌లింగంపల్లి, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, ఎస్‌ఆర్ నగర్, బషీర్‌బాగ్, ఫతేమైదాన్, విద్యానగర్, సంతోశ్‌నగర్ తదితర చోట్ల ఉన్నాయి. వాటిల్లో 201 దుకాణాలను అద్దెకిచ్చారు. గతంలో ఓసారి 14 దుకాణాలను వాటి నిర్వాహకులకే విక్రయించగా మిగతావి ఉన్నాయి.
ఐదేళ్లకోసారి అద్దెలను సవరించి 50 శాతం మేర పెంచాలనే ఒప్పందం ఉన్నా దుకాణాల నిర్వాహకులు దాన్ని పట్టించుకోకపోగా అద్దె చెల్లించకుండా, దుకాణాలు ఖాళీ చేయకుండా మొండికేస్తున్నారు. దుకాణదారుల నుంచి అద్దె వసూలు కష్టంగా మారిన నేపథ్యంలో వాటిని గంపగుత్తగా విక్రయించాలని నిర్ణయించారు.
ఇంటి పక్క స్థలాల విక్రయం...
కేపీహెచ్‌బీ లాంటి హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇప్పటికీ అక్కడక్కడా చిన్నచిన్న ప్లాట్లు మిగిలిపోయాయి. వాటి నుంచి బోర్డుకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వాటి పక్కనే ఉన్న ఇళ్ల వారికి వాటిని విక్రయించాలని ఇప్పుడు నిర్ణయించారు. ఇలాంటివి దాదాపు 400 బిట్లు ఉన్నాయి. సగటున ఒక్కోటి 35 గజాల మేర ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ ధర ప్రకారం వాటిని విక్రయించనున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు...
విజయనగర్ కాలనీలో హౌసింగ్ బోర్డుకు దాదాపు 40కిపైగా ఆస్తులున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు అప్పట్లో ఒక్కోటి వెయ్యి గజాల (గరిష్టంగా) వరకు ఉన్న ప్లాట్లను కేటాయించారు. అవన్నీ లీజు రూపంలో ఇచ్చినవే.
కానీ వాటి నుంచి లీజులు వసూలు కావట్లేదు. ఈలోగా కొందరు వాటిని ఇతరులకు విక్రయించడంతో ప్రస్తుతం ఆ ప్లాట్లు కొన్న వారి వారుసుల చేతుల్లో ఉన్నాయి. వాటి మార్కెట్ ధర నిర్ణయించి విక్రయించాలని నిర్ణయించారు.
ఆ ప్రాంతంలో గజం ధర రూ. లక్షకుపైగా ఉన్నప్పటికీ ఆ భూములను కబ్జాలో ఉంచుకున్న వారు కేవలం గజం రూ. 5 వేలు చొప్పున నిర్ణయించి తమకు విక్రయించాలని గృహనిర్మాణ మండలికి విన్నవించారు. రూ. 350 కోట్లకుపైగా విలువైన భూములను కేవలం రూ. 10 కోట్లకే కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ, మార్కెట్ ధర నిర్ధారించి విక్రయిస్తామని గృహనిర్మాణ మండలి పేర్కొంటోంది. ఇలా మొత్తంగా అన్ని కలిపితే 300 ఎకరాల వరకు ఉంటుందని అంచనా.
హౌసింగ్ బోర్డు లీజు స్థలాలు, షాపుల క్రమబద్ధీకరణ
హౌసింగ్ బోర్డుకు చెందిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వగా వాటిలో ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
లీజు ఒప్పందం పునరుద్ధరించుకోని సంస్థలకు లేఖలు రాసి వాటి క్రమబదీ్ధకరణకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బోర్డుకు 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనగా మిగిలిన 287 షాపులకుగాను ప్రస్తుతం 62 షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు.
బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ఏటా 10 శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి బోర్డుకు రూ. కోట్లు రావలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం షాపు లు నిర్వహిస్తున్నవారు వాటిని కొనేందుకు ముందుకొస్తే మార్కెట్ ధరకు విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. షాపు నిర్వహణకు అనువుగా లేని స్థలాలను వేలంలో విక్రయించాలన్నారు.
అలాగే బోర్డు గతంలో కేటాయించిన ఇళ్ల పక్కనే ఉన్న 100 గజాల్లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని సూచించారు. గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజి్రస్టేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని చెప్పారు.
మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ, 100 గజాల్లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజి్రస్టేషన్ చేసుకొని పక్కనే ఉన్న 100 గజాలలోపు స్థలాన్ని అడుగుతున్న వారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్ధాయి నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వాటన్నింటిపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


