పండక్కి బండేదీ! | - | Sakshi
Sakshi News home page

పండక్కి బండేదీ!

Dec 15 2025 1:04 PM | Updated on Dec 15 2025 1:04 PM

పండక్కి బండేదీ!

పండక్కి బండేదీ!

ప్రకటించిన ద.మ రైల్వే

తొలి రోజే భారీగా బుకింగ్‌లు

అన్ని రైళ్లలోనూ వెయిటింగ్‌

లక్షలాది మందికి పడిగాపులే

సంక్రాంతికి 41 ప్రత్యేక రైళ్లు

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగర వాసులను దక్షిణమధ్య రైల్వే ఉసూరుమనిపించింది. లక్షలాది మంది ప్రయాణానికి సన్నద్ధమవుతున్న తరుణంలో కేవలం 41 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. పైగా ఈ రైళ్లకు మొదటి రోజు ఆదివారమే చాలా మంది అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవడంతో లక్షలాది మందికి నిరాశే మిగిలింది. ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ తెరిచిన కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్‌లు భర్తీ అయ్యాయి. దీంతో చాలా మంది వెయిటింగ్‌ లిస్టుకే పరిమితమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్‌ రైళ్లలో ‘నోరూమ్‌’ దర్శనమిస్తుండగా తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు సైతం భారీ డిమాండ్‌ నమోదైంది. దీంతో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే తప్ప ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఆ రూట్లను మరిచారెందుకో?

ప్రస్తుతం కాకినాడ–వికారాబాద్‌ (07263/07264 ), కాకినాడ– సికింద్రాబాద్‌ (07279/07280), తిరుపతి– వికారాబాద్‌ (07265/07271), కాకినాడ–వికారాబాద్‌ (07272), సికింద్రాబాద్‌– కాకినాడ (07273 ), కాకినాడ టౌన్‌–లింగంపల్లి (07261/07262) నర్సాపూర్‌– వికారాబాద్‌ (07244/07245), సికింద్రాబాద్‌– నర్సాపూర్‌ (07247/07248), లింగంపల్లి– నర్సాపూర్‌ (07260/07259) తదితర రూట్లకే ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ ఉండే బెంగళూర్‌, తిరుపతి, విశాఖ, చైన్నె తదితర నగరాలకు అదనపు రైళ్లను ఏర్పాటు చేయలేదు. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి ఎక్కువ మంది విజయవాడకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఇంటర్‌సిటీ రైళ్లను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దూర ప్రాంతాల రైళ్లకు ఉండే డిమాండ్‌ దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది.

30 లక్షల మంది వెళ్తారని అంచనా..

వచ్చే సంక్రాంతికి నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ఏపీలోని సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ డిమాండ్‌ మేరకు రైళ్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ రద్దీ భారీగా ఉండే రూట్లలో కూడా కేవలం అరకొర రైళ్లను నడపడం వల్ల లక్షలాది మంది ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. గతంలో సంక్రాంతి, దసరా, వేసవి సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో సుమారు 100కు పైగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు రెగ్యులర్‌ రైళ్లకు అదనపు బెర్తులు, బోగీలను కూడా ఏర్పాటు చేసేవారు. కొంతకాలంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను క్రమంగా తగ్గించడం గమనార్హం. ఒకవైపు ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు రైళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి.

ప్రైవేట్‌ దారి దోపిడీ

ఈ క్రమంలో రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేని ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సులు, ట్యాక్సీలు, మినీబస్సులు వంటి వాటిని ఆశ్రయిస్తుండటంతో చార్జీలు మోయలేని భారంగా పరిణమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలను సంక్రాంతి రోజుల్లో రెట్టింపు చేస్తున్నారు. ఆర్టీసీలో సైతం ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా 50 శాతం అదనపు చార్జీలను విధించి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. అంతిమంగా నగటు నగరవాసి సంక్రాంతి సంబరం ప్రయాణంలోనే ఆవిరవుతోంది. అందుబాటులో ఉన్న ప్రజారవాణా సదుపాయాల్లో కేవలం రైలు ప్రయాణం ఒక్కటే తక్కువ చార్జీలతో లభిస్తుంది. కానీ.. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు మాత్రం అందుబాటులో ఉండడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement