కష్టపడతాం కనికరించండి
● పార్టీ పదవుల్లేక ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం
● కొందరు నగర బీజేపీ నేతల అంతర్మథనం
సాక్షి, సిటీబ్యూరో: చిన్న పదవి ఇవ్వండి చాలు. కష్టపడి పనిచేస్తాం. సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం. నిత్యం ప్రజల్లో తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం’ అంటున్నారు నగరానికి చెందిన కొందరు బీజేపీ నేతలు. మాజీ ఎమ్మెల్యేలు సహా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీపరంగా పదవులు లేకపోవడంతో అంతర్మథనం చెందుతున్నారు. ఇక కింది స్థాయి నేతల ఊసే పట్టించుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. పుష్కర కాలంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. హైదరాబాద్‌కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదని, పార్టీ పదవులను ప్రకటించడంలో 15 ఏళ్లుగా పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వంపై రుసరుసగా ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి 12 పోస్టులు కేటాయించుకున్నారని, మిగతా నగరానికి మొండిచేయి చూపించారంటూ కొందరు నేతల తీరును తప్పును ఎత్తిచూపుతున్నారు. పార్టీ అధిష్టానం తీరుతోనే క్షేత్రస్థాయిలో పనిచేసే వారి సంఖ్య తగ్గుతోందని, దీనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి..
కొన్ని నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటున్నారు. కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటువంటి సమయంలో పార్టీ నుంచి ఎలాంటి పదవి లేకపోవడంతో ఎలా ముందుకెళ్లేదంటూ పలువురు నగర బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పార్టీ పరంగా 8 జిల్లాలు ఉన్నాయి. అందులో 550 వరకు పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది. జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, యువ, దశిత, మహిళా, ఓబీసీ, మైనార్టీ మోర్చా కమిటీల గురించి అసలే పట్టించుకోవడం లేదని, నియోజకవర్గ స్థాయి పార్టీ పదవుల భర్తీపై నాయకత్వం దృష్టి సారించడం లేదంటున్నారు.
● ‘మాజీ ఎమ్మెల్యేలు రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ లాంటి వ్యక్తులకే పార్టీ పరంగా ఎలాంటి పదవి లేకుండాపోయింది. చోటా మోటా నాయకులను పట్టించుకునేదెవరు’ అంటూ నిట్టూర్చుతు న్నారు. త్వరలో జీహెచ్‌ఎంసీ 150 నుంచి 300 వార్డులకు పెరగనుంది. దీంతో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పార్టీ పదవుల విషయమై రాష్ట్ర అగ్రనేతలను నిలదీస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌నే బయటకు పంపించారని ఇక తామెంత అంటూ మిన్నకుంటున్నామంటున్నారు. గ్రేటర్‌లో అధికారంలోకి రావాలంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, పార్టీ పదవులను భర్తీ చేసి, జెండా మోసిన నాయకులను ప్రోత్సహించాలని కోరుతున్నారు.


