రెండేళ్లుగా ఏర్పాటుకు నోచుకోని అసెంబ్లీ కమిటీలు
24 అసెంబ్లీ కమిటీల్లో నాలుగు కమిటీలకే మోక్షం
ముందుకు సాగని డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
ఉభయ సభల్లో ఖాళీగా ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగి అసెంబ్లీ కొలువు దీరి రెండేళ్లు పూర్తయినా ‘మినీ శాసనమండళ్లు’గా వ్యవహరించే అసెంబ్లీ కమిటీలు మాత్రం ఇప్పటికీ ఏర్పాటుకు నోచుకోలేదు. శాసనసభ నిర్వహణలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రెండేళ్లుగా భర్తీ కాలేదు. మరోవైపు అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులను సమన్వయం చేసే చీఫ్ విప్, విప్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. మండలిలోనూ ప్రభుత్వ విప్ పదవులు భర్తీ కాలేదు.
దీంతో అసెంబ్లీ నిర్వహణలో వైఫల్యాలు చోటుచేసుకుంటూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరును విశ్లేషించి అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్దేశించే అసెంబ్లీ కమిటీలు లేకపోవడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పాటించట్లేదు.
అసెంబ్లీకి ఉన్న సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే ఈ కమిటీలు ఆర్థిక, అంచనాల పరిశీలన, ప్రభుత్వ ఖర్చుల ఆడిట్, చట్టాల అమలు పర్యవేక్షణ, సభా కార్యకలాపాల నిర్వహణ, అసెంబ్లీ సభ్యుల అధికారాల పరిరక్షణ కోసం పనిచేస్తాయి. వివిధ శాఖల పనితీరు నివేదికలు, సిఫారసులను ఈ కమిటీలు ప్రభుత్వానికి అందిస్తాయి.
అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంచేస్తోంది. కానీ అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
నాలుగు కమిటీలే ఏర్పాటు
అసెంబ్లీలో అంతర్భాగమైన శాసనసభ, శాసనమండలికి సంయుక్తంగా, విడివిడిగా కలిపి మొత్తం 24 కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉభయ సభల సభ్యులతో కూడిన 13 కమిటీలు, శాసనసభకు ఐదు, మండలికి ఆరు కమిటీలు ఉంటాయి.
అయితే ఇప్పటివరకు 4 సంయుక్త కమిటీలు, శాసనసభ, మండలికి బిజినెస్ అడ్వైజరీ కమిటీలే ఏర్పడ్డాయి. శాసనసభ, మండలి సభ్యులతో కూడిన పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్‌టేకింగ్స్, ఎస్టిమేట్స్ కమిటీలు 2023 డిసెంబర్‌లో ఏర్పడగా మీడియా అడ్వైజరీ కమిటీ ఇటీవల ఏర్పాటైంది.
అయితే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ ఎమ్మెల్యే అయిన పద్మావతిరెడ్డి చైర్‌పర్సన్‌గా ఎస్టిమేట్స్ కమిటీ ఏర్పాటవగా ఆమె మొదట్లోనే రాజీనామా చేశారు. నాటి నుంచి కొత్త కమిటీ నియామకం జరగలేదు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)ని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా నియమించడంపై బీఆర్‌ఎస్ అభ్యంతరం తెలుపుతోంది.
షాద్‌నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య అధ్యక్షతన ఏర్పాటైన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ మాత్రమే అడపదడపా భేటీ అవుతోంది.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎప్పుడో?
డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో సభ్యుల హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని విపక్ష సభ్యులు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచందర్‌నాయక్ పేరును ఖరారు చేసినట్లు గతంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగలేదు. ప్రస్తుతం ఆయన సభలో కాంగ్రెస్ విప్‌గా కొనసాగుతున్నారు.
అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), ఆది శ్రీనివాస్ (వేములవాడ), బీర్ల ఐలయ్య యాదవ్ (ఆలేరు)లను సైతం విప్‌లుగా నియమించగా వారిలో అడ్లూరి మంత్రి అయ్యారు. దీంతో అసెంబ్లీలో చీఫ్ విప్‌తోపాటు రెండు ప్రభుత్వ విప్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండలిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేస్తుండగా విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
సభ హుందాతనం కాపాడాలి
రెండేళ్లు గడిచినా అసెంబ్లీ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకం అంశాన్ని గాలికి వదిలేశారు. అన్ని అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. సభ హుందాతనాన్ని కాపాడాలి. – హరీశ్‌రావు, మాజీ మంత్రి
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సభ నిర్వహణ మొదలు సభా సంప్రదాయాల వరకు అన్నింటినీ తుంగలో తొక్కి ప్రభుత్వం ఇష్టారీతిన సభ నడుపుతోంది. ఇప్పటికైనా అసెంబ్లీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత


