ఈ నెలాఖరులో లేదా జనవరిలో నిర్వహించే యోచన
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై పోరుబాట
ఈ నెల 19న పార్టీ భేటీలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న కేసీఆర్
సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ సమావేశానికి రానున్న పార్టీ అధినేత
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. మరోవైపు నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది.
బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాలమూరు ఎత్తిపోతలపై అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 19న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేయనున్నారు.
పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి ఈ నెల 11న ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం.
‘కొడంగల్ లిఫ్ట్’పై బీఆర్‌ఎస్ వ్యతిరేకత
90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఈ నెలాఖరు లేదా జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది.
కేసీఆర్ ఈ సభలకు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నదీ జలాల అనుసంధానం పేరిట ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమానికి కేసీఆర్ ఇప్పటికే రూపకల్పన చేసినట్లు సమాచారం.
కాళేశ్వరం మరమ్మతుల కోసం ఒత్తిడి
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రభుత్వానికి జల విధానం లేకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 19న జరిగే భేటీలో కేసీఆర్ ప్రకటించే ఉద్యమ కార్యాచరణపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత కేసీఆర్ పార్టీ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వస్తున్న కేసీఆర్.. పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా స్పందించే అవకాశం ఉంది.


