గుట్టలు, కొండలు దిగుతూ అడవిలో 20 కిలోమీటర్లు నడుస్తూ ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న పెనుగోలు ఓటర్లు (ఫైల్)
ములుగు జిల్లాలో ఓటేయాలంటే కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే
మూడో విడతలో ఎన్నికలకు సిద్ధమైన ఆ 10 గిరిజన గ్రామాల ఓటర్లు
ములుగు: మూడో విడతలో భాగంగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు మండలాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలే. ఆయా మండలాల్లోని పెనుగోలు, బొల్లారం, మండపాక, కలిపాక, పెంకవాగు, సీతారాంపురం, ముత్తారం, సర్వాయి, మల్కపల్లి, భూపతిపురం ఆదివాసీ గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు అడవిబాటలో నడిచి రావాల్సిందే. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు గుట్టలు, కొండలు దాటుతూ బాధ్యతగా ఓటు వేసి అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు.
వాజేడు పరిధిలో
⇒ కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలులో 29 మంది ఓటర్లు ఉంటారు. వీరు కొండలు, గుట్టలు దాటుకుంటూ అడవి మార్గాన ప్రయా ణిస్తూ 20 కిలోమీటర్ల దూరంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి.
⇒ మొరుమూరు పంచాయతీ పరిధిలోని బొల్లారం గిరిజన గూడెంలో 263 మంది ఓటర్లు ఉంటారు. వీరు 9 కిలోమీటర్ల దూరంలోని ప్రగళ్లపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి.
⇒ ఏడ్జెర్లపల్లి పంచాయతీ పరిధిలోని మండపాకకు చెందిన 133 మంది ఓటర్లు 8 కిలోమీటర్ల దూరంలోని ఏడ్జెర్లపల్లికి వచ్చి ఓటేయాలి.
వెంకటాపురం(కె) పరిధిలో
⇒ భోదాపురం పంచాయతీ పరిధిలో కలిపాక, పెంకవాగు గిరిజన గ్రామాల్లో 110 మంది ఓటర్లు ఉంటారు. వీరు కాలినడకన 5 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్‌లో ఓటేయాలి.
⇒ అలుబాక పంచాయతీ పరిధిలోని సీతారాంపురం, ముత్తారం గిరిజన గ్రామాల్లో 100 మంది ఓటర్లు ఉంటారు. వీరు 6 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. 
గుట్టలు, కొండలు దిగుతూ అడవిలో 20 కిలోమీటర్లు నడుస్తూ ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న పెనుగోలు ఓటర్లు (ఫైల్)
కన్నాయిగూడెం మండలంలో..
సర్వాయి గిరిజనగూడెంలో 198 మంది ఓటర్లు, మల్కపల్లిలో 99 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ట్రాక్టర్‌పై 12 కిలోమీటర్లు ప్రయాణించి చిట్యాల పో లింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ఇదే పంచాయతీ పరిధిలోని భూపతిపురంలో 295 మంది ఓటర్లు ఉంటారు. రవాణా సౌకర్యం ఉన్నా, బైక్‌లు, ఆటో ల్లో 8 కిలోమీటర్లు వచ్చి చిట్యాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
వార్డు ఓట్లన్నీ గంపగుత్తగా...
తొర్రూరు రూరల్: రెండో విడత ఎన్నికల్లో 100 శాతం ఓట్లతో ఓ వార్డు సభ్యుడు చరిత్ర సృష్టించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలోని 6వ వార్డు నుంచి బానోతు తేజానాయక్ పోటీ చేశాడు. ఈ వార్డులో 95 ఓట్లు ఉండగా, మొత్తం ఓట్లు తేజానాయక్‌కే పడ్డాయి. ప్రత్యర్థులెవరికి ఈ వార్డులో ఓట్లు లేవు.


