ప్రస్తుత సీజన్ నుంచే ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్
ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రైతుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇకపై రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదని, అవసరమైన కోటాను ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ నెల 20 నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్‌ను ప్రయో గాత్మకంగా అమల్లోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్‌తోపాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసు కోవచ్చని, రైతు తన పంటలకు అవసరమైన యూరియా పరిమాణం, తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచైనా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుందన్నారు.
అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి సేవలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీ నంబరు లభిస్తుందని, ఆ బుకింగ్ ఐడీ ఆధారంగా, రైతు తాను ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. బుకింగ్ సమయంలో రైతు కేవలం పంట పేరు మరియు ఆ పంట సాగు విస్తీర్ణం నమోదు చేస్తే సరిపోతుందని, నమోదు చేసిన వివరాల ఆధారంగా, రైతుకు అర్హమైన మొత్తం యూరియా పరిమాణాన్ని మరియు ఏఏ వ్యవధుల్లో బుక్ చేసుకోవచ్చో గణిస్తుందని, రైతుల సౌకర్యార్థం, ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంచామని మంత్రి వివరించారు.
యాప్ ప్రత్యేకతలు
⇒ రైతులు/ సిటిజన్, డిపార్ట్‌మెంట్ మరియు డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు
⇒ మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే అవకాశం
⇒లాగిన్ కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తుంది
⇒ లాగిన్ అయిన రైతులు తన జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది.
⇒తర్వాత ఏ సీజన్, రైతు పట్టాదార్ పాస్‌బుక్ నంబర్, ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారో, ఏఏ పంటను వేస్తున్నారో ఎంటర్ చేయాలి.
⇒ రైతు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్‌లో కనిపిస్తాయి. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశల్లో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి.
⇒ పాస్‌బుక్‌లు లేని రైతులు వారి పట్టా పాస్‌బుక్ దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత పై వివరాలను నింపాలి.
⇒ కౌలు రైతులు కూడా వారి పేరు, తండ్రిపేరు మరియు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ కన్ఫార్మేషన్ తర్వాత భూ యజమాని పట్టా పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేస్తే, యజమాని మొబైల్ నంబరుతో ఓటీపీ వ్యాలిడేషన్ తర్వాత కౌలు రైతులు కూడా తమ వివరాలు ఎంటర్ చేసేలా ఈ యాప్‌లో అవకాశం కల్పించారు.
⇒ ఇక, డీలర్లు వారి మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి..రోజువారీగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకం వివరాలను నింపాలి.


