సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్: జిల్లాలో మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్‌స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌తో సమీక్షించారు. గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. మూడో విడతకు హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇల్లందకుంటలో సీతారామచంద్రస్వామి ఆలయ కల్యాణమండపం, సైదాపూర్‌లో వెంకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.


