● సొంత వైద్యంతో సమస్య జఠిలం ● జాగ్రత్తలు తీసుకుంటే వ్యా
కరీంనగర్: ప్రస్తుతం జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు శీతల గాలుల తీవ్రత పెరుగుతోంది. ఆ ప్రభావంతో చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. చర్మం పొడిబారడం, పగళ్లు రావడం, దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎక్కువగా చర్మసమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇంట్లో ఒకరికి చర్మ సమస్య వచ్చిందంటే అది ఇంటిల్లిపాదికి వచ్చే ప్రమాదముందని, చర్మ సమస్యలు ఉన్న వారు వాడిన సబ్బులు, టవల్స్, బట్టలు ఇతరులు వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, లేదంటే అందరికి చర్మ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందంటున్నారు. జిల్లాలో 50 మందికి పైగా చర్మవ్యాధి నిపుణులు ఉండగా వారం పది రోజులుగా నిత్యం 100కుపై ఓపీ పేషెంట్లు వస్తున్నారు.
ఎదురయ్యే ఇబ్బందులు
చలికాలంలో చర్మం పొడిబారి తామర వస్తుంది. దురద ఉంటుంది. గోకితే దద్దుర్లు ఏర్పడి మంట పుడుతుంది. జలుబు, దగ్గు, ఎక్కువగా ఉన్న పిల్లలు ఎటోఫిన్ డెర్మటైటిస్ వ్యాధికి గురికావడంతోఎరుపు రంగు మచ్చలు వస్తాయి. సోరియాసిస్ సోకి చర్మంపై మచ్చలు ఏర్పడి పొట్టులా రాలిపోతూ దురద వస్తుంది. తలలో చుండ్రు పెరుగుతోంది. సెబోరిక్ డెర్మటైటిస్ తలలో ఏర్పడి పొట్టులా చర్మం ఊడిపోతుంది. కాళ్ల మడమలు, పెదాలు, చేతులపై పగుళ్లు వస్తాయి. చేతి మునివేళ్లు మంగా ఉండి గుంజినట్లు అవుతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
బయటకు వెళ్లేటప్పుడు పూర్తిగా చర్మాని కప్పేలా ఉన్ని లేదా కాటన్ దుస్తులు ధరించాలి. సన్‌స్క్రీన్ లేపనాలు వాడాలి. గ్లిజరిన్ సబ్బులు వాడాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. చర్మం తేమగా ఉండేలా ప్రతి 2 గంటలకోసారి కొబ్బరినూనె, కోల్డ్ మాయిశ్చరైజర్ క్రీములు పూసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. విటమిన్‘సి’ ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. సోరియాసిస్, తామర, దద్దుర్లు ఏర్పడితే ఇంట్లోనే సొంత వైద్యాన్ని చేసుకోకుండా తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాలి. గహిణులు పాత్రలు కడిగేందుకు సబ్బులు వాడతారు. ఆ పని పూర్తయిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకొని కొబ్బరినూనె, మాయిశ్చరైజర్‌క్రీములు, ఇతర లేపనాలు రాసుకోవాలి.


